Kothagudem: తుఫాన్ బాధితులను ఆదుకోవాలి, నష్టపరిహారం చెల్లించాలి!

Kothagudem: అశ్వారావుపేటలో మురుసు తుఫాన్ నష్టపోయిన పంటలను, రింగుబండ గండిని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరిశీలించి, బాధితులకు తక్షణ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 5 Nov 2026 4:16 PM IST
Kothagudem
X

Kothagudem: తుఫాన్ బాధితులను ఆదుకోవాలి, నష్టపరిహారం చెల్లించాలి!

Kothagudem: మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలో రైతులకు, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.

దెబ్బతిన్న పంట పొలాలు, గండ్లు పడిన చెరువులు, కొట్టుకుపోయిన రహదారులను పరిశీలిస్తూ బాధిత రైతులతో నేరుగా మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై, తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దు!

తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తు వారి ఆశలను ఆవిరి చేసిందని మెచ్చా ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి సమగ్రంగా పంట నష్టం అంచనా వేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అచ్యుతాపురం చిన్నయ్యకట్టు చెరువుకు గండి పడటంతో రహదారి పూర్తిగా కొట్టుకుపోయిన ప్రాంతాన్ని మెచ్చా పరిశీలించారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే మరమ్మతులు చేపట్టి రహదారిని పునరుద్ధరించాలని సూచించారు.

పాతనారంవారిగూడెం నుంచి గుర్రాల చెరువుకు వెళ్లే మార్గంతో పాటు పాతనారంవారిగూడెం నుంచి మొద్దులమడకు వెళ్లే రహదారులు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ మార్గాలపై ఆధారపడే ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని దొంతికుంట చెరువు వద్ద గండికొట్టడంతో నష్టపోయిన రైతులను మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించారు.రైతులతో మాట్లాడి వారి పంట నష్టం, ఆర్థిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.కేవలం హామీలతో సరిపెట్టకుండా నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులందరికీ న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

నారాయణపురంలో తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టు వద్ద రూ.3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన రింగుబండకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన పనులు కనీసం ఒక తుఫాన్‌ను కూడా తట్టుకోలేకపోవడం నిర్మాణ నాణ్యతపై అనేక అనుమానాలకు తావిస్తోందని తీవ్రంగా విమర్శించారు.కేవలం కమిషన్ల కోసమే ఈ నిర్మాణం చేపట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయని, ఈ రింగుబండ నిర్మాణం వల్ల ఒక్క రైతుకైనా ప్రయోజనం కలిగిందా? అని ప్రశ్నించారు.

రూ.3.5 కోట్ల ప్రజాధనం బూడిదలో పోసినట్లయిందని మండిపడ్డారు. పనుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ముందుచూపు లేకుండా, సరైన ప్రణాళికతో పనులు చేపట్టకపోవడం వల్లే ఇది జరిగిందని ఆరోపించారు. ఈ నిర్మాణంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతుల పంటలు, కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు కాపాడాల్సిన బాధ్యత పాలకులు, అధికారులపై ఉందన్నారు. విపత్తులు వచ్చినప్పుడు హడావుడిగా పర్యటించడం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.


ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, రహదారులు, చెరువులకు శాశ్వత మరమ్మతులు చేయాలని, నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ ZPTC జూపల్లి రమణారావు గారు, మాజీ MPP జల్లిపల్లి శ్రీరామమూర్తి గారు, మోహన్ రెడ్డి గారు, యుఎస్ ప్రకాశ్ రావు గారు,స్థానిక BRS నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA