Khammam: స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులను మోసం చేశారు బి.జి. క్లెమెంట్!
Khammam: ఖమ్మంలో జరిగిన ఆర్టీసీ సమావేశంలో ఈయూ గౌరవ అధ్యక్షులు క్లెమెంట్ మాట్లాడుతూ.. అశ్వద్ధామ రెడ్డి కార్మికులను మోసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Khammam: స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులను మోసం చేశారు బి.జి. క్లెమెంట్!
Khammam: ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సిన నాయకులే తమ స్వార్థ ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని మోసం చేసి తీవ్ర అన్యాయం చేశారని ఎంప్లాయిస్ యూనియన్ (EU) ఖమ్మం రీజినల్ గౌరవ అధ్యక్షులు బి.జి. క్లెమెంట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన రీజనల్ డిపో కార్యదర్శుల సమావేశం ఏఐటియుసి ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావి శివరామకృష్ణ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, అశ్వద్ధామ రెడ్డి కార్మిక నాయుకుని ముసుగులో కార్మికులకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. చారిత్రాత్మకమైన ఆర్టీసీ సమ్మె కాలంలో కార్మికుల ఐక్యతను, వారి రక్తమాంసాలను అడ్డంపెట్టుకుని కొందరూ స్వార్థపరులు లబ్ది పొందారే తప్ప, కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని క్లెమెంట్ మండిపడ్డారు. కష్టకాలంలో కార్మికులకు అండగా ఉండాల్సిన నాయకత్వమే యాజమాన్యంతో కుమ్మక్కై, హక్కులను కాలరాసేలా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. కార్మికుల జీతభత్యాలు, పీఆర్సీ మరియు పెండింగ్ డిమాండ్ల సాధనలో అశ్వద్ధామ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఆయన వ్యక్తిగత అజెండా వల్లే ఆర్టీసీ కార్మిక లోకం తీవ్రంగా నష్టపోయిందని స్పష్టం చేశారు.
కార్మికుల ముసుగులో చలామణి అవుతూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించే నాయకులను ఇకపై సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇలాంటి నాయకులు యాజమాన్యంతో కుమ్మక అవ్వకపోతే ఇప్పటివరకు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమై ఆరు సంవత్సరాలు అయ్యేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులు మరియు కార్మిక సంఘాలు ఇప్పటికైనా అప్రమత్తమై, మోసపూరిత నాయకత్వాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కార్మికుల నిజమైన హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం కోసం ఎంప్లాయిస్ యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని, కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా తమ పోరాటం కొనసాగుతుందని అక్టోబర్ 9న జరిగే ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయూ, ఎన్ఎంయు కూటమిగా ఏర్పడి పాల్గొంటుందన్నారు. ఖమ్మం రీజియన్ కూటమిలో భాగమైన ఎన్ఎంయుకు కేటాయించడం జరిగిందని కాగడ గుర్తుపై ఓటు వేయాలని రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ బస్సు గుర్తుపై పోటీ చేస్తుందని కార్మికులందరూ అధిక సంఖ్యలో బస్సు గుర్తుకు ఓటేసి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు కార్యనిర్వాహక అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ , ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి రమేష్ , బోడ వీరన్న, కార్యదర్శి నకిరేకంటి కృష్ణ ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ ప్రధాన కార్యదర్శి పిల్లి రమేష్, డిపో కార్యదర్శి బుచ్చిబాబు , ప్రచార కార్యదర్శి జేకే, కోశాధికారి లాదర్ , వల్లపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




