Khammam: ఖేలో ఇండియా ఆర్చరీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

Khammam: డిసెంబర్ 17 నుంచి 20 వరకు ఖమ్మం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో జరిగే ఖేలో ఇండియా జాతీయ ఆర్చరీ పోటీలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 9 Nov 2026 5:51 PM IST
Khammam
X

Khammam: ఖేలో ఇండియా ఆర్చరీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ఖమ్మం: స్థానిక సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో డిసెంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఖేలో ఇండియా జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో ఖేలో ఇండియా పోటీల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఖేలో ఇండియా జాతీయస్థాయి ఆర్చరీ పోటీల నిర్వహణపై ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. జాతీయస్థాయి పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు, సహాయక సిబ్బంది, సాంకేతిక నిపుణులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

పోటీ కోసం మొత్తం 134 మంది జిల్లాకు వస్తున్నారని ఇందులో 64 మంది క్రీడాకారులు, 20 మంది సహాయక సిబ్బంది, 20 మంది సాంకేతిక సిబ్బంది, 24 మంది క్రీడా వాలంటీర్లు, ఇతరులు ఉంటారని తెలిపారు. వీరికి అవసరమైన వసతి సదుపాయాల కోసం చెక్‌లిస్ట్ ప్రకారం మొత్తం 74 గదులను ముందస్తుగా బుక్ చేయాలని ఆదేశించారు.

క్రీడాకారులు, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు లేకుండా 22 వాహనాలను ఏర్పాటు చేయాలని, వాహనాలు, హోటళ్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.

స్టేడియంలో, ప్రతి హోటల్‌లో త్రాగునీరు, పారిశుధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి హోటల్‌కు ఒక లైజన్ అధికారిని నియమించి, సంబంధిత హోటల్ యాజమాన్యంతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు.

పోటీలు జరిగే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి చేరుకునే రహదారులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, ఇతర మౌళిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. క్రీడా శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పోటీల నిర్వహణకు అవసరమైన అన్ని పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

పోటీల సమయంలో క్రీడాకారులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, సమీప ఆసుపత్రుల్లో అవసరమైన పడకలను ముందుగానే రిజర్వ్ చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది, అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు డిసిపి రామానుజం, డివైఎస్ఓ సునీల్ రెడ్డి, ఆర్టీఓ జగదీష్, ఫైర్ అధికారి బి.అజయ్ కుమార్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ వి. రంజిత్, అసిస్టెంట్ కమీషనర్ అనిల్ కుమార్, టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులు, తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.