Kothagudem: కొత్తగూడెం ఐడీఓసీలో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవ వేడుకలు!
Kothagudem: కొత్తగూడెం ఐడీఓసీలో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవ వేడుకలు. చిరుధాన్యాల సాగు, సేంద్రీయ వ్యవసాయంపై డీఎంహెచ్వో డాక్టర్ తుకారాం రాథోడ్ అవగాహన.
Kothagudem: ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలోని జిల్లా అధికారుల సముదాయం (IDOC)లో ఉన్న DM&HO కార్యాలయ సమావేశ మందిరంలో ఆహార భద్రత, చిరుధాన్యాల సాగు, సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DM&HO డాక్టర్ తుకారాం రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే పరిస్థితులు ఏర్పడితే భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలు, చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. చిరుధాన్యాల్లో శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని వివరించారు. వరి సాగుకు అధికంగా నీరు అవసరమయ్యే నేపథ్యంలో నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే రసాయన ఎరువులు, పురుగుమందులను అధికంగా వినియోగించడం వల్ల నేల నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. సేంద్రీయ ఎరువులను వినియోగిస్తూ ఆరోగ్యకరమైన పంటలను పండించాలని, నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలని సూచించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంతో పాటు భూసారాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డాక్టర్ తుకారం రాథోడ్ పేర్కొన్నారు.




