Khammam: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు: ఖమ్మం కలెక్టర్!

Khammam: చింతపల్లి రైతు సదస్సులో కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావంతో వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 29 Oct 2026 7:12 PM IST
Khammam
X

Khammam: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు: ఖమ్మం కలెక్టర్!

Khammam: ఎల్నినో ప్రభావం వలన వర్షభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భూగర్భ జలాలు తగ్గడం, వచ్చే ఏడాది ఆగస్టు వరకు వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున కూరగాయలు, చిరుధాన్యాలు వంటి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలిపారు. వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకుని తేమతో పండే పంటలను ఎంచుకోవాలని అన్నారు. పశువుల దాణా సమస్య తలెత్తకుండా ఉచిత పశుగ్రాస విత్తనాల కిట్లను అందిస్తున్నామని అన్నారు.

వర్షభావం దృష్ట్యా ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ. 308 ల కూలీతో ఎక్కువ పనిదినాలు కల్పిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను, రైతులను వేధిస్తున్న కోతుల బెడదపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, తగిన నివారణ చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు. ప్రాంతీయంగా వలస వస్తున్న నైజీరియా కొంగలు సంరక్షణ కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను చేస్తామన్నారు.

అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ మొదటి, రెండో విడతలు మంజూరయ్యాయని, మూడో, నాలుగో, ఐదో విడతలు మంజూరు అవుతాయని, ప్రతి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.

రాబోయే గ్రాడ్యుయేట్ ఎంబిసి ఎన్నికల దృష్ట్యా, అక్టోబర్ 31, 2023 నాటికి డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఫారమ్-18 ద్వారా వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటరుగా నమోదు కు నవంబర్ 6 వరకు మాత్రమే గడువు ఉందని తెలిపారు. ఓటరు లిస్టులో నమోదు చేసుకున్న, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు దరఖాస్తు తప్పనిసరి అని తెలిపారు. సంబంధిత తహసీల్దార్ కార్యాలయం, బూత్ స్థాయి అధికారిని సంప్రదించాలని, ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ అన్నారు.

కార్యక్రమంలో రైతులడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు. వ్యవసాయ, ఉద్యానవన, ఇర్రిగేషన్ శాఖల అధికారులు రైతులకు ఎల్నినో ప్రభావం గురించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి ఎం.వి. మధుసూదన్, ఇర్రిగేషన్ డిఈ రాజేష్, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ వినయేందర్ రెడ్డి, ఎంపీడీవో రవికుమార్, వ్యవసాయ అధికారి సురేష్, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.