Kothagudem: ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలి: సంజయ్ జాజు
Kothagudem: రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలని, ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక, సబ్సిడీ సిమెంట్ అందించాలని కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
Kothagudem: ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలి: సంజయ్ జాజు
Kothagudem: ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరును మరింత మెరుగుపరచాలని, వివిధ ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, నిర్దేశిత లక్ష్యాల సాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ, VBGRAMG, చేయూత పింఛన్ల వెరిఫికేషన్, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఐడీఓసీ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష, పీఎం శ్రీ నిధుల వినియోగం పెంచాలి
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ సూచించారు. సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల కింద మంజూరైన నిధులను జనవరి మొదటి వారంలోగా 100 శాతం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎం శ్రీ పథకం కింద రూ.538 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు 10 శాతం కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 794 పీఎం శ్రీ పాఠశాలల్లో నిధుల వినియోగంతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్లు దృష్టి సారించాలని తెలిపారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సమగ్ర శిక్ష అభియాన్ కింద రూ.1,763 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు రూ.79 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర శిక్ష, VBGRAMG నిధులను సమన్వయంతో వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫారాలు, కిట్లు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలను నాణ్యతతో అమలు చేయాలని ఆదేశించారు.
వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత
రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా వేసవి ముగిసే వరకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. ప్రతి జిల్లాలో జిల్లా తాగునీటి కమిటీలను ఏర్పాటు చేసి, ప్రతి వారం సమావేశమై సరఫరా పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు. చేతిపంపులు, బోర్ పంపులు, బహిరంగ బావులకు అవసరమైన మరమ్మతులు నవంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
మిషన్ భగీరథ పైప్లైన్లలో ప్రెజర్ వాల్వ్‌లను నిరంతరం పర్యవేక్షించాలని, నీటి వృథాను అరికట్టడంతో పాటు అక్రమ కనెక్షన్లు, ట్యాపింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
VBGRAMG పథకం ద్వారా నాణ్యమైన, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే పనులు చేపట్టాలని సీఎస్ సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 5.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని, మార్చి నెలాఖరు నాటికి 12 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని సాధించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్‌లో ఉన్న ఇళ్ల మంజూరు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు కొత్త లోగోతో కూడిన స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని, 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందించాలని, రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం 'మన ఇసుక – మన వాహనం' యాప్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఒక్కో సిమెంట్ బస్తాను రూ.230 చొప్పున లబ్ధిదారులకు సరఫరా చేయాలని, సబ్సిడీ ద్వారా లభించే ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ సవేరామ్, జిల్లా విద్యాశాఖ అధికారి శంభు ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి అనూష, అదనపు డీఆర్డీఓ రవి, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.




