Bhadrachalam: కోటి సోమవారం శోభ.. భద్రాచలం గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి!

Bhadrachalam: కార్తీక మాసం కోటి సోమవారం సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 16 Nov 2026 11:01 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: కోటి సోమవారం శోభ.. భద్రాచలం గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి!

Bhadrachalam: కార్తీక మాసం కోటి సోమవారం సందర్భంగా భద్రాద్రి పుణ్యక్షేత్రం భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర గోదావరి నదికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరి ఘాట్ల వద్ద కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహిళలు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి గోదావరి నదిలో వదులుతూ భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. గోదావరి తీరమంతా భక్తులతో కిటకిటలాడింది.

కార్తీక మాసంలో సోమవారానికి అత్యంత విశిష్టత ఉందని భక్తులు విశ్వసిస్తారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ఉపవాసం, నదీ స్నానం, దీపారాధన, దీపదానం, శివాభిషేకాలు చేయడం విశేష పుణ్యప్రదమని పురాణాలు పేర్కొంటున్నాయి. సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలయికతో వచ్చే రోజును కోటి సోమవారంగా పేర్కొనే ఆధ్యాత్మిక సంప్రదాయం ఉంది. ఈ రోజున ఉపవాసం ఆచరిస్తే కోటి సోమవారాల ఉపవాస ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

మరోవైపు భద్రాచలంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోనూ భక్తుల సందడి నెలకొంది. గురుస్వాముల సమక్షంలో పలువురు భక్తులు అయ్యప్ప మాలధారణ చేసి మండల దీక్షను స్వీకరించారు. అనంతరం స్వామివారి పల్లకి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప అనే శరణుఘోషలు, భజనలు, భక్తి గీతాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

ఒకవైపు గోదావరి పుణ్యస్నానాలు, మరోవైపు కార్తీక దీపారాధనలు, ఇంకోవైపు అయ్యప్ప స్వామి మాలధారణ, పల్లకి ఊరేగింపులతో భద్రాచలం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాస సోమవారం సందర్భంగా భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem