Khammam: అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు!
Khammam: ఖమ్మంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యంగా సన్నాహక సమావేశం.
Khammam: అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు!
Khammam: ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ఖమ్మం పట్టణంలోని ఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలంటే పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని భట్టి విక్రమార్క అన్నారు. జిల్లా స్థాయి సమావేశం అనంతరం ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, గ్రామస్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సీనియర్ నాయకుడిని ఇన్‌ఛార్జిగా నియమించి, వారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం ప్రస్తుత ఎన్నికల ప్రక్రియకు అనుగుణంగా మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ కుటుంబాల్లోని పట్టభద్రులను గుర్తించి, వారంతా ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలని చెప్పారు. అనంతరం తటస్థ ఓటర్లను, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సానుకూలంగా ఉన్న ఇతర వర్గాల పట్టభద్రులను కలిసి పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టాలని సూచించారు.
3.42 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న ప్రయోజనాలను ఇంటింటికీ వివరించాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సుమారు కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా, దాదాపు కోటి 6 లక్షల కుటుంబాలకు చెందిన 3 కోట్ల 42 లక్షల మందికి ప్రతి నెలా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు లభించే సన్నబియ్యాన్ని పేదలకు ఉచితంగా అందించడం ద్వారా ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, సుమారు 72 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఆర్థిక సహాయం అందించామన్నారు. గృహజ్యోతి పథకం కింద సుమారు 53 లక్షల మందికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకాల వల్ల కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గుతోందని చెప్పారు.
సామాజిక భద్రతలో భాగంగా సుమారు 43 లక్షల మందికి చేయూత పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి 6 లక్షల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు వైద్య చికిత్స పొందే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఈ పథకం అండగా నిలుస్తోందన్నారు.
విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో సుమారు 12.5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు ఒక గ్లాసు పాలు అందించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందని వివరించారు.
ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
రాష్ట్రంలో ఇల్లు లేని పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని చెప్పారు. తొలి దశలో 4.5 లక్షల ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రెండో దశలో మరో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసే దిశగా, ఒక్కో నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున ముందుకు సాగుతున్నామని వివరించారు. హైదరాబాద్‌లోనూ పేదలకు లక్ష ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 40 వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నదని చెప్పారు.
ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రతే లక్ష్యం
ఇందిరమ్మ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చే పెద్ద వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నామని వివరించారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా తెలంగాణలోని కుటుంబాలకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను కరపత్రాల రూపంలో రూపొందించి ప్రతి ఇంటికీ అందించాలని భట్టి విక్రమార్క పార్టీ నాయకులకు సూచించారు.
కాంగ్రెస్‌కు అంకితమైన కుటుంబం నుంచి సర్వోత్తమ్ రెడ్డి
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉందని పేర్కొన్నారు. రాంరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి వంటి నాయకుల కుటుంబం పార్టీకి అవసరమైన ప్రతి సందర్భంలో అండగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ కోసం నిబద్ధతతో పనిచేసిన ఈ కుటుంబాన్ని పార్టీ ఎప్పటికీ మరిచిపోదని చెప్పారు.
సర్వోత్తమ్ రెడ్డిని కేవలం ఒక అభ్యర్థిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా భావించి ఆయన విజయం కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు నుంచి ఎన్నికల్లో ఓటు వేసే వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది ఉన్న ప్రాంతమని పేర్కొంటూ, అదే ఐక్యతను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాటాలని, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్ మట్ట రాగమయి కోరం కనకయ్యలు ప్రసంగించారు. ఈ సమావేశానికి డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ అధ్యక్షత వహించారు.




