Sathupalli: ఈ నెల 29న సత్తుపల్లిలో దీక్షా దివస్ కార్యక్రమం: సండ్ర వెంకటవీరయ్య!

Sathupalli: ఈ నెల 29న సత్తుపల్లిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం తెలిపారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 25 Nov 2026 9:48 PM IST
Sathupalli
X

Sathupalli: ఈ నెల 29న సత్తుపల్లిలో దీక్షా దివస్ కార్యక్రమం: సండ్ర వెంకటవీరయ్య!

సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సత్తుపల్లిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి, వేంసూరు మండలాలతో పాటు సత్తుపల్లి పట్టణ, రూరల్ ప్రాంతాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలించిన కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందని, అయితే కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎదురైన పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయని విమర్శించారు.

తెలంగాణకు రావాల్సిన నదీ జలాల వాటాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పల్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో నాగార్జునసాగర్ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అన్నారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వం సరైన వైఖరిని ప్రదర్శించడం లేదని విమర్శించారు. డిసెంబర్ మొదటి వారంలో నల్గొండ వేదికగా కృష్ణా జలాలపై జరుగుతున్న అన్యాయానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావంతో సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వేంసూరు తదితర ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని తెలిపారు. తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు కీలక మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే అయినప్పటికీ రైతులకు పంట నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన గ్రామ సర్పంచులను గౌరవించకుండా, వారిపై కేసులు పెట్టడం, గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో సంక్షేమ పథకాల పంపిణీలో రాజకీయ జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు. అర్హులైన పేదలకు పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు.

ఈ నెల 29న సత్తుపల్లిలో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకత్వం పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సండ్ర వెంకటవీరయ్య కోరారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI