Kothagudem: సాంస్కృతిక సారథి కళాకారిణి ఆరోపణలు.. డీపీఆర్ఓపై విచారణకు డిమాండ్!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి ఆరోపణలు. డీపీఆర్ఓపై లైంగిక వేధింపులు, నెలవారీ వసూళ్ల ఒత్తిడి, వేతన కోతలపై విచారణకు డిమాండ్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Updated on: 25 Nov 2026 5:41 PM IST
Kothagudem
X

Kothagudem: సాంస్కృతిక సారథి కళాకారిణి ఆరోపణలు.. డీపీఆర్ఓపై విచారణకు డిమాండ్!

Kothagudem: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ గళాన్ని ఆయుధంగా మలుచుకుని ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ప్రత్యేక గుర్తింపుతో పాటు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సారథి సంస్థను ఏర్పాటు చేసింది.

ఉద్యమ సమయంలో పాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన కళాకారులకు నెలవారీ వేతనాలు అందిస్తూ వారి జీవనోపాధికి భరోసా కల్పిస్తోంది. అయితే కళాకారులకు అండగా నిలవాల్సిన వ్యవస్థలోనే వేధింపుల ఆరోపణలు తెరపైకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న కౌసర్ అనే కళాకారిణి జిల్లా పౌర సంబంధాల అధికారి అజ్గర్ హుస్సేన్‌పై లైంగిక వేధింపులు, ఆర్థిక ఒత్తిళ్లకు సంబంధించిన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. జిల్లాలో మొత్తం 18 మంది కళాకారులు పనిచేస్తుండగా, ప్రతి ఒక్కరూ నెలకు రూ.1,000 చొప్పున 18,000 డీపీఆర్ఓకు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.

టీమ్ లీడర్ ద్వారా ఈ మొత్తాలను చెల్లించాలని, చెల్లించని వారికి గైర్హాజరు నమోదు చేసి వేతనాల్లో కోతలు విధిస్తున్నారని వాపోతున్నారు.

తన విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని కౌసర్ ఆరోపిస్తున్నారు. తాను డిమాండ్ చేసిన మొత్తాన్ని ఒక నెల చెల్లించనందున ఐదు రోజుల పాటు గైర్హాజరుగా నమోదు చేసి వేతనంలో కోత విధించారని పేర్కొంటున్నారు. అంతేకాకుండా తనను క్షేత్రస్థాయిలో కళా ప్రదర్శనలకు పంపకుండా కార్యాలయంలోనే సహాయకురాలిగా ఉండాలని ఒత్తిడి చేయడంతో పాటు, లైంగికంగా వేధించారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఉద్యమ కళాకారిణికి న్యాయం ఎప్పుడు?

తెలంగాణ ఉద్యమంలో పాటలతో ప్రజలను కదిలించిన కళాకారులు నేడు తమ ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. ప్రజల్లో చైతన్యం నింపిన కళాకారిణి తన విధులను గౌరవంగా నిర్వర్తించాల్సిన చోటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేయడం మానవీయంగా ఆలోచించాల్సిన అంశం.

ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని, బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు ఆమెకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలువురు కోరుతున్నారు. నెలవారీ వసూళ్ల ఆరోపణలపైనా పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

ఉద్యమంలో గళమెత్తిన కళాకారిణి.. నేడు తన ఆత్మగౌరవం కోసం గళమెత్తుతోంది. ఆమెకు న్యాయం జరిగేనా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM