Kothagudem: ఓటు హక్కుపై విస్తృత అవగాహన కల్పించాలి..అదనపు కలెక్టర్!
Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్‌లో SVEEP ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల్లో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ పాల్గొని ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని సూచించారు.
Kothagudem: ఓటు హక్కుపై విస్తృత అవగాహన కల్పించాలి..అదనపు కలెక్టర్!
Kothagudem: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ సూచించారు.
రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు SVEEP (సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్), ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు ఎన్నికల ప్రక్రియ, ఓటరు నమోదు, ఎన్నికల విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ద్వారా విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటరు నమోదు, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రంగ ప్రసాద్, జిల్లా ELC కోఆర్డినేటర్ పూసపాటి సాయికృష్ణ, ఎన్నికల విభాగం సిబ్బంది నవీన్ కుమార్, అశోక్ కుమార్ పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు ప్రభావతి, తారాచంద్, విజయ నిర్మల, కామేశ్వరి, వివేక్ వ్యవహరించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి విజేతలుగా నిలిచిన విద్యార్థులు, వారి గైడ్ ఉపాధ్యాయులు కలిపి సుమారు 130 మంది పాల్గొన్నారు.




