Khammam: నేతల బజారు భాషతో రాజకీయం దిగజారుతోంది: తమ్మినేని వీరభద్రం!

Khammam: రాష్ట్రంలో అధికార, విపక్ష నేతలు వాడుతున్న బజారు భాష ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఖమ్మం మీట్ ద ప్రెస్‌లో మండిపడ్డారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 5 Oct 2026 7:21 PM IST
Khammam
X

Khammam: నేతల బజారు భాషతో రాజకీయం దిగజారుతోంది: తమ్మినేని వీరభద్రం!

ఖమ్మం: రాష్ట్రంలో అధికార, విపక్ష నేతలు వాడుతున్న బజారు భాష రాష్ట్ర రాజకీయాలను దిగజారుస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపి తమ్మినేని వీరభద్రం తెలిపారు. గౌరవనీయ భాష ప్రయోగించకుండా నీచ పదజాలం రాజకీయాల్లో సరైంది కాదని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించుకే భూ కబ్జాలు, ఆక్రమణల వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

సోమవారం టియుడబ్ల్యూజె (ఐజేయు) ఆధ్వర్యంలో తమ్మినేనితో మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ సమన్వయ కర్తగా వ్యవహరించగా టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని మాట్లాడుతూ నేతల భాష ఆక్షేపణీయమని ఈ భాష సరైంది కాదన్నారు.

విమర్శించడానికి ఈ పద్ధతి తగదని ఆయన కాంగ్రెస్, బిఆర్ఎస్లకు సూచించారు. రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య భూ ఆక్రమణలు, అక్రమ సంపాదనలకు సంబంధించి పరస్పర విమర్శల పర్వం సాగుతుందని కేవలం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే పథకం ప్రకారం రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పాపాలు చేయడంలో రెండు పార్టీలు సమానమేనని రేవంత్రెడ్డి కుటుంబ సభ్యుల భూ వ్యవహారాలకు సంబంధించి బిఆర్ఎస్ కేవలం ఆరోపణలకే పరిమితం అవుతుండగా అధికారం చేతిలో ఉన్న కాంగ్రెస్ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తుందని ఈ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.

కాంగ్రెస్ భూ ఆక్రమణలపై బిఆర్ఎస్ కార్యాచరణ చేపట్టదని బిఆర్ఎస్ భూ ఆక్రమణలపై అధికార పార్టీ చర్యలకు పూనుకోదని ఈ విషయం ప్రజలకు కూడా తెలుసునన్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు భూములు పంచేందుకు జంకేందుకని తమ్మినేని ప్రశ్నించారు. హామీలు అమలు పరచలేని కాంగ్రెస్ వల్ల కార్యాచరణ లేని బిఆర్ఎస్ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో ప్రజల పాత్ర క్రమేపి తగ్గిపోతుందన్నారు. ఒకప్పుడు రిగ్గింగులు, ఓట్ల కొనుగోలు, ఇప్పుడు గెలిచిన అభ్యర్థులను కొనుగోలు చేయడం ఏకంగా ఓటింగ్ మిషన్ల ద్వారా ఓట్లను సానుకూలంగా వేయించుకునే పద్దతికి తెరలేపారన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా తీసుకు వచ్చే ప్రయత్నంలో బిజెపి 2024లోనే సఫలీకృతమైనట్లు అనేక సర్వేలు చెబుతున్నాయన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం పాలన సాగడం లేదని ప్రజల విమర్శకు కనీసం సమాధానం చెప్పే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదన్నారు.

ఎవరైనా విమర్శిస్తే దేశ ద్రోహులుగా ముద్రిస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఎంపికే తప్పని పద్దతి ప్రకారం జరగని ఎన్నికల కమిషన్ ఎంపికతో అధికారానికి ఎన్నికల కమిషనర్ దాసోహం అన్నారని ఆయన తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందేనని తమ్మినేని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆ క్రమంలోనే దిమాగినక్సల్స్ పదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. నక్సల్స్ పేరుతో అడవుల్లోని సాయుధులను హతమార్చినట్లు ఆలోచించగలిగి సమాజం కోసం పనిచేసే వారిని దిమాగి నక్సల్స్ పేరుతో హతమారుస్తారా అని తమ్మినేని ప్రశ్నించారు.

బిజెపి గ్రాఫ్ పడిపోతుందని 2014లో సంక్షేమం, ఆర్ధిక ప్రణాళికతో ముందుకు వచ్చిన బిజెపి 2024 నాటికి మతాన్ని ఎజెండాగా చేసిందని బిజెపి కేవలం టిడిపి, ఇతర మిత్ర పక్షాల మద్దతుతోనే అధికారంలోకి రాగలిగిందన్నారు. అమెరికాకు మోడీ దాసోహం అంటుండగా అమెరికాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొందని అక్కడి ప్రజలు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారని తమ్మినేని తెలిపారు.

భారతదేశంలో అవినీతి వ్యవస్థీకృతమవుతుందని ఆయన తెలిపారు. వ్యవస్థీకృతమైన అవినీతి పేద, సామాన్య ప్రజలకు తీవ్ర నష్టాన్ని, కష్టాలను తెచ్చిపెడుతుందన్నారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పక్కదారి పట్టించేందుకే విపక్షంపై ఆరోపణలు చేసి రాద్దాంతం చేస్తుందని చివరకు ఏమి తేల్చలేని స్థితికి దిగజారుతుందన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చే స్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. బిఆర్ఎస్ కూడా ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప కార్యాచరణ ప్రకటించడం లేదన్నారు.

రాష్ట్రంలో మూడో ఫ్రంట్కు అవకాశం లేదని తమ్మినేని తెలిపారు. కమ్యూనిస్టుల సమీకరణ శక్తి తగ్గుతుందన్న ప్రశ్నకు తమ్మినేని సమాధానం ఇస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో వచ్చిన మార్పులు కొంత కారణమని కానీ ప్రజల సమస్యలపై నిరంతర ఆందోళనలు చేస్తూనే ఉన్నామన్నారు. ఎన్నికల ఫలితాలపై తమ్మినేని మాట్లాడుతూ బలమైన ఎజెండాతో ఎన్నికల్లోకి వెళ్తున్న బూర్జువా పార్టీల ఆర్థిక, వ్యవహారాలు ఎన్నికల సంఘం వ్యవహార శైలితో ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నామన్నారు.

కాంగ్రెస్తో 2024లో పొత్తు చెడిపోవడానికి పాలేరు కారణం కాదని తమ్మినేని స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య సరైన అవగాహన లేదని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. ప్రజలను కదిలించడం ద్వారా ప్రజా ఉద్యమ నిర్మాణానికి సిపిఎం ప్రాధాన్యతనిస్తుందన్నారు. వామపక్షాల ఐక్యత గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఐక్య కార్యాచరణ లేకుండా ఐక్యత సాధ్యం కాదని సిపిఐ, సిపిఎంల మధ్య పార్టీ కార్యక్రమంలోనే తేడా ఉందని దాని సరిచేసుకుంటేనే ఐక్యత సాధ్యమవుతుందన్నారు.

విలీనానికి సిపిఎం వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార కాంక్షతో వ్యవహరిస్తుందని ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను సైతం ఓడించేందుకు ప్రయత్నిస్తుందని అదే విషయం కేరళలో స్పష్టమైందన్నారు. జన్జ ఉద్యమం అంతకు ముందు రైతు ఉద్యమం ఈ దేశంలో ఇటీవల కాలంలో అపూర్వ విజయాలు సాధించాయని రైతు ఉద్యమం నల్ల చట్టాలను రద్దు చేయించగలిగితే జనీ ధర్మేంద్ర ప్రధాన న్ను రాజీనామా చేయించిందని ఇప్పుడు ఎన్నికల కమిషనర్ కూడా రాజీనామా చేయాలని లేని పక్షంలో జన్బీతో పాటు వామపక్షాలు, కలిసి వచ్చే శక్తులను కలుపుకుని ఉద్యమిస్తాయన్నారు.

జనీ డిమాండ్లు కమ్యూనిస్టుల డిమాండ్లనని ఆయన తెలిపారు. సిపిఎం నాయకుని హత్యకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి నియోజక వర్గంలో జరిగినప్పుడు ఎవరు హత్య చేశారో తేల్చాల్సిన బాధ్యత ఆయనకే ఉందని హంతకులను అరెస్టు చేయండి అంటూ ఇప్పటికే సిపిఎం పలు ఆందోళనలు చేపట్టిందని ఒక ప్రశ్నకు సమాధానంగా తమ్మినేని తెలిపారు. ఒకరిద్దరు వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారశైలి కారణంగానే ఏదులాపురం మున్సిపాలిటీలో ఒక స్థానం ఏకగ్రీవమైందని అది పార్టీ నిర్ణయం కాదన్నారు. ఖమ్మం జర్నలిస్టులు తమ్మినేనిని శాలువతో సత్కరించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.