Kothagudem: ‘నా కొడుకు’ షార్ట్ ఫిలింను విడుదల చేసిన ఎస్కే సాబీర్ పాషా
Kothagudem: కొత్తగూడెంలో అసూయాద్వేషాలు, మానవ సంబంధాలపై శ్రీనివాస్ దొడ్డ దర్శకత్వంలో రూపొందిన ‘నా కొడుకు’ షార్ట్ ఫిలింను సీపీఐ నేత ఎస్కే సాబీర్ పాషా విడుదల చేశారు.
Kothagudem: ‘నా కొడుకు’ షార్ట్ ఫిలింను విడుదల చేసిన ఎస్కే సాబీర్ పాషా
కొత్తగూడెం: సమాజంలో పెరుగుతున్న అసూయాద్వేషాలు, పగప్రతీకారాలు, కుటుంబ అనుబంధాల విచ్ఛిన్నం వంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన ‘నా కొడుకు’ షార్ట్ ఫిలింను సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యాంత్రిక జీవితంలో యువతతో పాటు అన్ని వయసుల వారు బంధాలు, బంధుత్వాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతి, అసమానతలు పెరిగే పరిస్థితులు భవిష్యత్తు తరాలకు మంచివి కావన్నారు. సమాజాన్ని చైతన్యపరచడంలో రాజకీయ, మీడియా, సినిమా రంగాలు శక్తివంతమైన సాధనాలని పేర్కొన్నారు.
తక్కువ బడ్జెట్‌తో, పరిమిత సౌకర్యాల మధ్య మంచి సందేశంతో షార్ట్ ఫిలిం రూపొందించడం అభినందనీయమన్నారు. దర్శకుడు శ్రీనివాస్ దొడ్డతో పాటు నటీనటులను అభినందించారు. 70ఎంఎంలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని జిల్లా ప్రజలు ఆదరించాలని, నూతనంగా వస్తున్న కళాకారులను ప్రోత్సహించాలని కోరారు.
అనంతరం షార్ట్ ఫిలింను వీక్షించి ప్రోత్సహించిన సాబీర్ పాషాకు దర్శకుడు శ్రీనివాస్ దొడ్డ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్ దొడ్డ, నటులు జలాల్ మహమ్మద్, ఆవుదుర్తి సతీష్, భారత్ తదితరులు పాల్గొన్నారు.




