Kothagudem: తుఫాను నష్టపరిహారం ఇచ్చి అన్నదాతలను ఆదుకోవాలి!

Kothagudem: సుజాతనగర్ మండలంలో తుఫానుకు దెబ్బతిన్న పంటలను సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా పరిశీలించి, ఎకరాకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 5 Nov 2026 2:00 PM IST
Kothagudem
X

Kothagudem: తుఫాను నష్టపరిహారం ఇచ్చి అన్నదాతలను ఆదుకోవాలి!

Kothagudem: జిల్లాలో తీవ్ర తుఫాను ధాటికి సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సుజాతనగర్ మండల పరిధిలో ముంపునకు గురై తీవ్రంగా దెబ్బతిన్న వరి, పత్తి, మిరప, మొక్కజొన్న తోటలను గురువారం సీపీఐ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

ఈ సందర్భంగా పొలాల్లోకి దిగి నీటమునిగిన పైర్లను పరిశీలిస్తూ, తీవ్ర ఆవేదనలో ఉన్న బాధిత రైతులతో నేరుగా మాట్లాడి నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాబీర్ పాషా మాట్లాడుతూ.. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొని రైతులు తీవ్రంగా నష్టపోయారని, అరకొర ఉన్న నీటి వనరులతో ఎంతో శ్రమకోర్చి పంటలు సాగు చేస్తే ఈ తుఫాను వారిని మరింత నష్టాల ఊబిలోకి నెట్టివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో వారంలో చేతికందే దశలో ఉన్న వేలాది ఎకరాల వరి పంట అకాల తుఫానుతో నీటిపాలై మొలకలు వచ్చే దుస్థితి దాపురించిందన్నారు. కాయల దశలో ఉన్న పత్తి చేలల్లోకి నీరు చేరి కుళ్లిపోయి నల్లబడగా, పూత, ఎదుగుదల దశలోని మిరపలో వేరుకుళ్లు, కొమ్మకుళ్లు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.

ములకలపల్లి, దమ్మపేట పరిసరాల్లోని ఆయిల్ పామ్, ఉద్యానవన తోటల్లోకి వాగుల వరద చేరి కోతలకు, రవాణాకు తీవ్ర ఆటంకం కలిగిందన్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి నివేదికలను ప్రభుత్వానికి పంపాలని, ఎకరా వరి, మొక్కజొన్నకు రూ.40 వేలు, మిరప, పత్తికి రూ.50 వేలు, ఉద్యాన పంటలకు రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతులు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని, పరిహారం దక్కేవరకు సీపీఐ అండగా ఉండి ప్రతుత్వంపై వత్తిడి తెస్తుందని భరోసా ఇచ్చారు. బృందంలో సిపిఐ, ఏఐకేఎస్, బికేయంయు నాయకులు సలిగంటి శ్రీనివాస్, భూక్య దస్రు, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, తాళ్లూరి ధర్మారావు, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, భూక్య శ్రీను, ప్రతాప్ సింగ్, సాయి ప్రవీణ్, ఏవో నర్మద తదితరులు ఉన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM