Julurupadu: భూ రీ-సర్వే పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్ అంకిత్
Julurupadu: జూలూరుపాడు మండలం నల్లబండ బోరు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Julurupadu: భూ రీ-సర్వే పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్ అంకిత్
Julurupadu: జూలూరుపాడు మండలం నల్లబండ బోరు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భూ రీ-సర్వే పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన సర్వే వివరాలు, గ్రామ సరిహద్దుల నిర్ధారణ తదితర అంశాలను సర్వే, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు.
నల్లబండ బోరు గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 1,426 ఎకరాల భూమి ఉండగా, సుమారు 12.50 కిలోమీటర్ల మేర భూ రీ-సర్వే ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. గ్రామ సరిహద్దులను నిర్ణయిస్తూ సర్వే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. భూ రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించి, భూముల వివరాలు కచ్చితంగా నమోదు చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
భూ రీ-సర్వే సందర్భంగా ప్రతి భూమికి సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అవసరమైన సాంకేతిక పద్ధతులను వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
భూ సరిహద్దుల విషయంలో రైతులకు ఉన్న సందేహాలను క్షేత్రస్థాయిలోనే నివృత్తి చేయాలని సూచించారు. రీ-సర్వే పూర్తయిన అనంతరం భూములకు సంబంధించిన రికార్డులు మరింత స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు భూ యాజమాన్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామంలోని రైతులతో కలెక్టర్ మాట్లాడి భూ రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు, వారి భూముల వివరాలు, సాగు చేస్తున్న పంటలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు భూక్యా పంతులు తనకు రెండు ఎకరాల భూమి ఉందని, అందులో ఒక ఎకరంలో పత్తి, మరో ఎకరంలో మిర్చి సాగు చేస్తున్నట్లు కలెక్టర్‌కు వివరించారు.
తన కుమారులు తనను పట్టించుకోవడం లేదని, వృద్ధాప్య పింఛన్ కోసం ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు రైతు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులు వెంటనే దరఖాస్తును పరిశీలించి, అర్హత మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జూలూరుపాడు తహసీల్దార్ శ్రీనివాస్,ఎంపీడీవో తాళ్లూరి రవికుమార్, సర్వేయర్, సర్పంచ్ జి. సింధు, రైతులు, సర్వే సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




