Khammam: ఖమ్మంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రచారానికి కలెక్టర్ ప్లాన్!

Khammam: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో డిసెంబర్ 17-21న జాతీయ ఆర్చరీ పోటీల నేపథ్యంలో 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026' ప్రచారానికి కలెక్టర్ ప్రణాళిక విడుదల చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 24 Nov 2026 3:29 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రచారానికి కలెక్టర్ ప్లాన్!

Khammam: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 8వ ఎడిషన్ 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026' క్రీడలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో విస్తృత స్థాయి ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాలలోని 20 వేదికలలో డిసెంబర్ 11 నుండి 22 వరకు ఈ క్రీడలు జరగనుండగా, ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో డిసెంబర్ 17 నుండి 21 వరకు జాతీయ స్థాయి ఆర్చరీ (విలువిద్య) పోటీలు నిర్వహించబడుతున్నాయని కలెక్టర్ అన్నారు.

ఈ క్రీడలపై విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలలో విస్తృత అవగాహన కల్పించేందుకు నవంబర్ 16 నుండి డిసెంబర్ 22 వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

​కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నవంబర్ 26న ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, ఏదులాపురం మున్సిపాలిటీలు, అన్ని మండల స్థాయిలలో లోగో, మస్కట్ ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే మాల్స్, పార్కులు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు మరియు పోటీల వేదిక వద్ద కనీసం మూడు చోట్ల మస్కట్ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడంతో పాటు, కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో మస్కట్ కటౌట్లు, స్టాండీలు, 'కౌంట్‌డౌన్ టు KIYG 2026' బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు అన్నారు.

నవంబర్ 30 నాటికి ప్రధాన కూడళ్లు, టోల్ గేట్లు, బస్ షెల్టర్ల వద్ద హోర్డింగ్‌లు, డిజిటల్ స్క్రీన్ల ద్వారా ప్రచారం కల్పించడంతో పాటు, భద్రతా అనుమతులకు లోబడి హాట్-ఎయిర్/హీలియం బెలూన్ లేదా భారీ మస్కట్ ఏర్పాటు, ప్రముఖ కట్టడాలకు క్రీడా రంగుల విద్యుత్ దీపాలంకరణ చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1 నాటికి పట్టణాలలోని ప్రజా గోడలు, ఫ్లైఓవర్లు, స్టేడియం ప్రహరీలపై క్రీడా నేపథ్యంతో కూడిన వాల్ ఆర్ట్ (మ్యూరల్స్) వేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

​విద్యార్థులు, యువతను భాగస్వాములను చేసేందుకు డిసెంబర్ 1న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన 'ఖేలో తెలంగాణ గ్లోబల్ క్విజ్' (ఆన్‌లైన్) నిర్వహించనున్నామని, ఇందుకోసం ప్రతి విద్యా సంస్థలో ఒక నోడల్ టీచర్‌ను నియమించి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా చూడాలని సూచించారు.

డిసెంబర్ 3న 'ఖేలో ఇండియా', మస్కట్ ఇతివృత్తంతో విద్యార్థులకు పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి, ఉత్తమ చిత్రాలను క్రీడా వేదికల వద్ద ప్రదర్శించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 6న మండల, జిల్లా స్థాయిలలో ప్రజాప్రతినిధులు, విఐపిలు, ఎన్.ఎస్.ఎస్, ఎన్.సి.సి, యువజన సంఘాలు, క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారుల భాగస్వామ్యంతో మస్కట్ ప్రదర్శనతో కూడిన 'ఖేలో ఇండియా రన్ / వాకథాన్ / సైక్లోథాన్' వంటి భారీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

​క్రీడల ముగింపు వరకు స్థానిక కేబుల్ టీవీలు, సినిమా హాళ్లు, ఎఫ్.ఎం రేడియో, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా నిరంతర ప్రచారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రతి శాఖ ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని, జిల్లా యువజన, క్రీడల అధికారి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ నివేదికలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.

జిల్లాలో జాతీయ స్థాయి పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు ఈ బాధ్యతలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. స్పష్టం చేశారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారీచేయనైనది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.