Kothagudem: మురసు తుఫాను హెచ్చరికలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి!
Kothagudem: మురసు తుఫాను నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా కలెక్టర్ అంకిత్ అధికారులతో సమీక్ష నిర్వహించి, 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
Kothagudem: మురసు తుఫాను హెచ్చరికలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి!
Kothagudem: మురసు తుఫాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వర్షపాత పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర సహాయక చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ హెచ్చరికలు, వర్షపాత తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు విధిగా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపల్ ప్రాంతాల్లో టాంటాం ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయాలని సూచించారు.
శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి, అందులో నివసిస్తున్న వారిని అవసరమైన మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పాత, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల పరిస్థితులను పరిశీలించి విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీలు, ఓపెన్ నాలాలను నిరంతరం పర్యవేక్షిస్తూ నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాత వంతెనలు, కల్వర్టులు, ప్రమాదకర రహదారులను పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 94 ప్రమాదకర రహదారుల వద్ద అవసరమైన చోట ముందస్తుగా బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
వాగులు, వంకలు పొంగి ప్రవహించే ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించాలని, చేపల వేట, పర్యాటక కార్యకలాపాలకు అనుమతించవద్దని అటవీ శాఖ అధికారులకు సూచించారు. మైనింగ్ కార్యకలాపాలపై కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.
ప్రజల సహాయార్థం 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణ సహాయం అందించేందుకు కొత్తగూడెంలోని ఐడీఓసీ కార్యాలయం, గది నంబర్ ఎఫ్-28లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమాచారం, వర్షాలు, వరదల కారణంగా ఎదురయ్యే సమస్యలను కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 08744-241950, 9392919743 ద్వారా తెలియజేయాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటూ ఫిర్యాదులను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, సంబంధిత శాఖలకు వెంటనే తెలియజేసి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అలాగే ప్రతి తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే సమాచారంపై తక్షణమే స్పందించాలని సూచించారు. అధికారులు విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
టెలికాన్ఫరెన్స్లో మండలాల వారీగా వర్షపాత పరిస్థితులను అధికారులు వివరించారు. చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, అశ్వారావుపేటలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు మున్సిపాలిటీల్లో సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేసి పారిశుద్ధ్య, డ్రైనేజీ నిర్వహణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.




