Julurpadu: జూలూరుపాడు పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్ అంకిత్!
Julurpadu: కొమ్ముగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఏ-1 పరీక్షలు, మధ్యాహ్న భోజనం, ప్రీ-ప్రైమరీ తరగతులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.
Julurpadu: జూలూరుపాడు పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్ అంకిత్!
Julurpadu: జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలు, పోషకాహారం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఏ–1 పరీక్షలను కలెక్టర్ పరిశీలించారు. వివిధ తరగతుల విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించి, వారు రాస్తున్న ప్రశ్నపత్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థుల అభ్యసన స్థాయి తదితర వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
పాఠశాలలో మొత్తం 73 మంది విద్యార్థులు ఉండగా, సోమవారం 62 మంది విద్యార్థులు హాజరైనట్లు ఉపాధ్యాయులు కలెక్టర్‌కు వివరించారు. విద్యార్థుల హాజరు శాతం మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని, గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో సమన్వయం చేసుకొని వారు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్, ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో చేపట్టిన పనులు, వాటి ప్రస్తుత పరిస్థితి, విద్యార్థులకు వాటి ద్వారా కలుగుతున్న ప్రయోజనాలపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రీ-ప్రైమరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడ 14 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలుసుకున్న ఆయన, వారికి అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. చిన్నారులకు నూతనంగా అందించనున్న ఏకరూప దుస్తులను పరిశీలించారు. వారి వయస్సుకు అనుగుణంగా విద్యాబోధన జరుగుతున్న తీరును, చిన్నారులకు కల్పిస్తున్న అభ్యసన వాతావరణాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
చిన్నారులు ఆటల ద్వారా ఉల్లాసంగా నేర్చుకునేలా పాఠశాలలో ఏర్పాటు చేసిన బొమ్మలు, ఆట వస్తువులను కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదుల్లో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలని, ఆటలు, బొమ్మలు, ఇతర అభ్యసన సామగ్రిని వినియోగిస్తూ చిన్నారుల్లో ఆసక్తిని పెంపొందించాలని సూచించారు.
విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారంపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ఉదయం 11 గంటలకు రాగిజావ, అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, మెనూ, ఆహార పదార్థాలు, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను వంట నిర్వాహకురాలిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాలలో విద్యార్థులకు అభ్యసనకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు వారి హాజరు, విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పోషకాహారంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు .
ఈ తనిఖీలు కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ జుంకీ లాల్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




