Palwancha: పాల్వంచ కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్!

Palwancha: పాల్వంచ కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల బోధన, నీట్ కోచింగ్, భోజన వసతులను పరిశీలించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 6 Oct 2026 3:28 PM IST
Palwancha
X

Palwancha: పాల్వంచ కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్!

Palwancha: పాల్వంచ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అందుతున్న విద్యా బోధన, NEET కోచింగ్, విద్యార్థుల హాజరు, పరీక్షల నిర్వహణ, మౌలిక వసతులు, భోజన సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులకు సూచించారు.

తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ ముందుగా ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుల హాజరు నమోదును పరిశీలించారు. పాఠశాలలో బోధనా కార్యక్రమాలు సక్రమంగా కొనసాగుతున్నాయా, ఉపాధ్యాయుల హాజరు ఎలా ఉంది, విద్యార్థుల హాజరు శాతం ఎంత అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, గైర్హాజరయ్యే విద్యార్థుల వివరాలను నమోదు చేసి, అవసరమైన సందర్భాల్లో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు.

అనంతరం ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఏ సబ్జెక్టుకు పరీక్ష రాస్తున్నారో అడిగి తెలుసుకోగా, కెమిస్ట్రీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. పరీక్షల అనంతరం విద్యార్థులకు నిర్వహిస్తున్న అధ్యయన కార్యక్రమాల గురించి కూడా కలెక్టర్ ఆరా తీశారు. NEET కోచింగ్‌లో భాగంగా విద్యార్థులకు సాయంత్రం 3.45 గంటల నుంచి 6.00 గంటల వరకు అదనపు బోధనా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ తరగతుల్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ తదితర సబ్జెక్టుల్లో బోధన అందిస్తున్నట్లు వివరించారు. NEET ప్రవేశ పరీక్షకు విద్యార్థులు సమర్థవంతంగా సన్నద్ధమయ్యేలా అదనపు తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం పాఠశాలలోని 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడారు. విద్యార్థులు ఏ తరగతిలో చదువుతున్నారు, ఆరోజు ఏ సబ్జెక్టుకు పరీక్ష రాశారు, పరీక్ష ఎలా జరిగింది, తదుపరి పరీక్ష ఏ సబ్జెక్టులో ఉంది వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సామాజిక శాస్త్రం, గణితం తదితర సబ్జెక్టుల పరీక్షలకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు తెలిపారు. SA-1 పరీక్షల్లో 80 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు.

విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా వారి చదువుపై ఆసక్తి, పరీక్షలకు సన్నద్ధమవుతున్న తీరు, తరగతుల నిర్వహణపై కలెక్టర్ ఆరా తీశారు. పరీక్షలు పూర్తయిన అనంతరం తదుపరి పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదువుకోవడంతో పాటు పరీక్షలకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని పేర్కొన్నారు.

పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య, తరగతుల వారీగా విద్యార్థుల సంఖ్యను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మొత్తం 355 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుని, విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, వారి విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

అనంతరం విద్యాలయంలోని కిచెన్ షెడ్డును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను స్వయంగా పరిశీలించి, వాటి నాణ్యత, పరిమాణం, పరిశుభ్రతను తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సరుకులు, కూరగాయలు,వంటగది పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంట ప్రక్రియ నుంచి భోజనం వడ్డించే వరకు పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందేలా సంబంధిత సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశించారు.

గత సంవత్సరం నాబార్డ్ నిధుల ద్వారా మంజూరైన నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు కిచెన్ షెడ్డును కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలు, ప్రస్తుతం షెడ్డును ఏ విధంగా వినియోగిస్తున్నారనే విషయాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నిర్మించిన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యా బోధనతో పాటు నాణ్యమైన వసతులు, పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణం, అదనపు శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. విద్యార్థుల హాజరును మెరుగుపరచడంతో పాటు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా నిరంతరం మార్గనిర్దేశం చేయాలని, ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు.

ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN