Kothagudem: ఇసుక రవాణాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక రవాణా, ట్రాఫిక్ నిర్వహణపై కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు సమగ్ర సమీక్ష. హోల్డింగ్, పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు ఆదేశం.
Kothagudem: ఇసుక రవాణాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు!
Kothagudem: జిల్లాలో ఇసుక రవాణా కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తో కలిసి బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం లో ఇసుక రవాణా, వాహనాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ ప్రాంతాలు, అక్రమ ఇసుక రవాణా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇసుక వాహనాల రాకపోకలు అధికంగా ఉన్న మణుగూరు, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాల్లో రోడ్ల సామర్థ్యం, ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాహనాల ఎంట్రీ, ఎగ్జిట్‌లను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో లారీలు రోడ్లపైకి రాకుండా అవసరానికి అనుగుణంగా దశలవారీగా వాహనాలను పంపించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
మణుగూరు, రామాంజవరం ప్రాంతాల్లో అవసరమైన హోల్డింగ్, పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి వినియోగంలోకి తీసుకురావాలని, చర్ల నుంచి భద్రాచలం మార్గంలో భారీ వాహనాల రాకపోకల కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం రహదారి మరమ్మతుల నాణ్యతపై తక్షణమే పరిశీలన చేసి నివేదిక అందించాలని సూచించారు.
బూర్గంపాడు పరిధిలో గొల్లగూడెం, సారపాక బ్రిడ్జి, తాళ్లగూడెం, ఉప్పాక, పినపాక పట్టినగర్ తదితర ప్రాంతాల్లో ఇసుక రవాణా వల్ల ఏర్పడుతున్న సమస్యలను గుర్తించి ప్రత్యామ్నాయ పార్కింగ్, హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ఇసుక రవాణా పెరిగే ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా ట్రాఫిక్ మార్షల్స్‌ను అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు. మణుగూరు, చెర్ల ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టీజీఎండీసీ అధికారులతో సమన్వయం చేసుకొని వాహనాల సాఫీ రాకపోకలకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒకేసారి అదనంగా వాహనాలు వచ్చినప్పుడు వాటిని నియంత్రించే విధంగా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాలోకి అక్రమంగా ఇసుక రవాణా జరిగే అవకాశాలను నిరోధించేందుకు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు. సీజ్ చేసిన ఇసుకను అక్కడే నిల్వ ఉంచకుండా తదుపరి చర్యల కోసం తరలించేలా ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వాహనాలు, జేసీబీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం జరిమానాలు విధించాలని ఆదేశించారు.
ఇసుక రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, అక్రమ ఇసుక రవాణా నియంత్రణలో పోలీసు, రెవెన్యూ, టీజీఎండీసీ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డిఆర్ఓ పద్మావతి,కొత్తగూడెం ఆర్డీవో మధు, ఏడి మైన్స్ దినేష్, జిల్లా రవాణా శాఖ అధికారి భూషిత్ రెడ్డి, తాసిల్దారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




