Khammam: పెండింగ్ సీఎంఆర్ బియ్యం డెలివరీని గడువులోగా పూర్తి చేయాలి!

Khammam: ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 1.06 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని జనవరి 31, 2027లోగా అందించాలని రైస్ మిల్లర్లను ఆదేశించిన అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 6 Nov 2026 4:56 PM IST
Khammam
X

Khammam: పెండింగ్ సీఎంఆర్ బియ్యం డెలివరీని గడువులోగా పూర్తి చేయాలి!

Khammam: జిల్లాలో రబీ 2024-25, ఖరీఫ్ 2025-26 సీజన్లకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బియ్యం డెలివరీని వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులను, రైస్ మిల్లర్లను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సివిల్ సప్లైస్ కమీషనర్ కార్యాలయ జీఎం రాజేందర్, డీజీఎం ఇర్ఫాన్‌ లతో కలిసి సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొని పెండింగ్ సీఎంఆర్ బియ్యం డెలివరీ, మిల్లర్ల వారీగా బియ్యం సరఫరా పురోగతి, బకాయి బిల్లుల చెల్లింపులపై సమీక్షించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రబీ 2024-25, ఖరీఫ్ 2025-26 సీజన్లకు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బియ్యం డెలివరీ పూర్తి చేసేందుకు ప్రతి మిల్లర్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

నిర్ణీత గడువులోగా సీఎంఆర్ బియ్యం సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించ వద్దని, గడువులోగా బియ్యం అందించని మిల్లర్లను నిబంధనల ప్రకారం డిఫాల్ట్ మిల్లర్లుగా పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెండింగ్ నిల్వలను ఎప్పటి కప్పుడు తగ్గించుకుంటూ, సివిల్ సప్లైస్‌కు బియ్యం సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.

మిల్లర్ల బకాయి బిల్లులను త్వరితగతిన చెల్లించాలి:

మిల్లర్లకు చెల్లించాల్సిన మిల్లింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలకు సంబంధించిన బిల్లులను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసి సంబంధిత అధికారులకు సమర్పించాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఏ ఒక్క బిల్లు కూడా పెండింగ్‌లో ఉంచకుండా, బిల్లుల పరిశీలన, ఆమోదం, తదుపరి చెల్లింపుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

మిల్లర్లకు రావాల్సిన అన్ని రకాల పెండింగ్ చెల్లింపులను త్వరితగతిన క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జీఎం రాజేందర్ కు తెలిపారు. బియ్యం డెలివరీ లక్ష్యాలను సాధించడంతో పాటు మిల్లర్లకు రావాల్సిన బకాయిల చెల్లింపుల్లో కూడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేస్తూ సీఎంఆర్ బియ్యం డెలివరీని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, వారానికి నిర్దేశించిన పురోగతిని సాధించేలా నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ సూచించారు.

సివిల్ సప్లైస్ కమీషనర్ కార్యాలయ జీఎం రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఎంఆర్ బియ్యం డెలివరీ పెండింగ్‌ లో 18 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లైస్‌కు చేరాల్సి ఉందని తెలిపారు. పెండింగ్ సీఎంఆర్ బియ్యం డెలివరీని వేగవంతం చేసేందుకు ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తూ సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో మొత్తం 1.25 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం డెలివరీ పెండింగ్‌లో ఉండగా, అందులో 1.06 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లైస్‌కు అందించాల్సి ఉందని తెలిపారు. సివిల్ సప్లైస్‌కు పెండింగ్‌లో ఉన్న 1.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జనవరి 31, 2027లోగా తప్పనిసరిగా అందించాలని మిల్లర్లకు సూచించారు.

ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి నెల కనీసం 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ప్రతి వారం సీఎంఆర్ డెలివరీ పురోగతిపై సమీక్ష నిర్వహించి, మిల్లర్ల వారీగా సరఫరా వివరాలను పరిశీలిస్తామని, నిరంతరం ఫాలోఅప్ చేస్తామని వెల్లడించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, డిఎం సివిల్ సప్లయ్ మల్లికార్జున బాబు, రైస్ మిల్లర్లు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.