Palwancha: అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలి: CITU
Palwancha: పాల్వంచలో 10 నెలల అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిలు, గ్యాస్ బిల్లులు చెల్లించి, నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు.
Palwancha: అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలి: CITU
పాల్వంచ: అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఇంటి అద్దెలను వెంటనే చెల్లించాలని CITU జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డా రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అద్దె బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ గురువారం పాల్వంచ ICDS ప్రాజెక్టు కార్యాలయం ఎదుట CITU పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దొడ్డా రవికుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల అద్దెలు పది నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో ఇంటి యజమానుల నుంచి ఖాళీ చేయాలనే ఒత్తిడి ఎదురవుతోందని తెలిపారు. దీంతో కొంతమంది అంగన్వాడీ టీచర్లు వడ్డీకి డబ్బులు తెచ్చి అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రాలకు సరఫరా అవుతున్న ఫీడింగ్ నాణ్యతపై కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
మూడు, నాలుగు నెలలకు ఒకేసారి సరుకులు సరఫరా చేయడం వల్ల గడువు ముగిసిన ఆహార పదార్థాలు వచ్చే పరిస్థితి ఉందని, కిచిడీ తయారీకి ఉపయోగించే రవ్వలో ఇసుక వస్తోందని ఆరోపించారు. నాణ్యత లేని ఆహారం వల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
ప్రతి నెలా ప్రాజెక్టు స్థాయి సమావేశాలు నిర్వహించకపోవడం, గ్రీవెన్స్ కమిటీ అందుబాటులో లేకపోవడం వల్ల అంగన్వాడీ సిబ్బంది సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకుండా పోతోందని పేర్కొన్నారు. వెంటనే నెలవారీ సమావేశాలు నిర్వహించాలని, నాణ్యమైన ఫీడింగ్ సరఫరా చేయాలని, పెండింగ్‌లో ఉన్న గ్యాస్ బిల్లులు, ఆరోగ్యలక్ష్మి బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో CITU జిల్లా సహాయ కార్యదర్శి కె. సత్య, వి. అచ్చమ్మ, పి. పద్మ, భాను, నాగమణి, పి. వెంకటరమణ, రామలక్ష్మి, చుక్కమ్మ, లక్ష్మి, బి. ఉమ, ఎస్.కె. ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.




