Khammam: పర్యావరణహితంగా, సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి!
Khammam: పర్యావరణహితంగా, సురక్షితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ విజ్ఞప్తి. గ్రీన్ క్రాకర్స్ వినియోగం, భద్రతా జాగ్రత్తలపై కలెక్టర్ సూచనలు.
Khammam: పర్యావరణహితంగా, సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి!
Khammam: దీపావళి పండుగను పర్యావరణహితంగా, సురక్షితంగా, సంతోషంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండుగ సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
బాణాసంచా కాల్చే సమయంలో ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. టపాసులు కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలని, నైలాన్, పాలిస్టర్ వంటి సింథటిక్ దుస్తులు ధరించకూడదని సూచించారు. భవనాలు, విద్యుత్ తీగలకు దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే బాణాసంచా కాల్చాలని, టపాసులు కాల్చే ప్రదేశంలో ముందస్తుగా ఒక బకెట్ నీరు, ఇసుక, ప్రథమ చికిత్స సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
పిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా వారి పక్కనే ఉండి పర్యవేక్షించాలని, బాణాసంచాను జేబుల్లో పెట్టుకోవడం, చేతుల్లో పట్టుకుని తిరగడం చేయకూడదని కలెక్టర్ సూచించారు. వెలగని టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకూడదని, వాటిని నీటితో తడిపి సురక్షితంగా తొలగించాలని పేర్కొన్నారు. ఇళ్లలో, గ్యారేజీల్లో, బాల్కనీల్లో బాణాసంచా కాల్చకూడదని తెలిపారు.
ప్రమిదలు, దీపాలను స్థిరమైన ప్రదేశాల్లో, కర్టెన్లు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర మండే వస్తువులకు దూరంగా ఉంచాలని, నిద్రించే ముందు లేదా బయటకు వెళ్లే ముందు వెలుగుతున్న దీపాలను ఆర్పివేయాలని సూచించారు. పెంపుడు జంతువులు, వీధి జంతువుల సమీపంలో పెద్ద శబ్దాలు వచ్చే బాణాసంచా కాల్చకూడదని తెలిపారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, ప్రమాదాలకు తావులేకుండా కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితమైన, ఆనందకరమైన దీపావళి పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.




