Palvancha: అమరవీరుల బాటలో ప్రజా ఉద్యమాలు కొనసాగించాలి: మంకెన వెంకటేశ్వర్లు
Palvancha: భూమి, భుక్తి, విముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల బాటలో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత మంకెన వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
Palvancha: అమరవీరుల బాటలో ప్రజా ఉద్యమాలు కొనసాగించాలి: మంకెన వెంకటేశ్వర్లు
పాల్వంచ, నవంబర్ 2: భూమి, భుక్తి, దేశ విముక్తి కోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం డివిజన్ నాయకుడు మంకెన వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
సమ సమాజ స్థాపన, నూతన ప్రజాస్వామిక విప్లవ సాధన లక్ష్యంగా సాగిన పోరాటాల్లో అనేకమంది యోధులు తమ ప్రాణాలను అర్పించారని ఆయన గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోట్ల రామ నర్సయ్యను 1976 నవంబర్ 1న పాకాల చెరువు సమీపంలోని చిలకల గుట్ట అడవిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హత్య చేసిందని పేర్కొన్నారు.
అలాగే 1991 మే 29న కాచనపల్లి వద్ద కామ్రేడ్స్ కోటన్న, పరశురాములు, సీతారామారావు, సుశేన, చింతలక్ష్మిని, 2019 జూలై 31న రోళ్లగడ్డ వద్ద కామ్రేడ్ పూనెం లింగన్నను పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపారని ఆరోపించారు. ఇలా ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని తెలిపారు.
ఒక మనిషి మరో మనిషిని దోపిడీ చేస్తున్నంత కాలం విప్లవోద్యమాలు కొనసాగుతాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని, అమరవీరుల ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్నం శ్రీను, మల్లేష్, సంపత్, రాజేష్, రాము, లక్ష్మయ్య, చరణ్ తదితరులు పాల్గొన్నారు.




