Burgampahad: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి 750 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి
Burgampahad: బూర్గంపహాడ్‌లో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్ నేత జలగం జగదీష్. 2027 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి.
Burgampahad: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి 750 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి
బూర్గంపహాడ్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక నిరీక్షణ సమస్యకు పరిష్కారం చూపాలని...ప్రతి 750 మంది పట్టభద్రుల ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్... ఈరోజు మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు..ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సారపాక యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, చట్టు ఆంజనేయులు, గుల్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు..
ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2027లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియలో బూర్గంపహాడ్ మండలంలో సుమారు 3,000 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బూర్గంపహాడ్ మండలంలో 2,079 మంది ఓటర్లకు కేవలం రెండు పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఒక్కో ఓటరు ఓటు వేయడానికి ఎక్కువ సమయం పట్టడం, మూడు నుంచి నాలుగు గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడం వల్ల ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారు, ఇతర వృత్తుల్లో ఉన్న పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేక వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయని వివరించారు.
సాధారణ ఎన్నికలకు భిన్నంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యతా ఓటు విధానం అమలులో ఉండటంతో పాటు అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల బ్యాలెట్ పేపర్ పెద్దదిగా ఉంటుందని, ప్రతి ఓటరు ఓటు వేయడానికి ఎక్కువ సమయం పడుతోందని పేర్కొన్నారు.
2027 ఎన్నికల్లో సమస్య మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉంది!
గత ఎన్నికల్లో 2,079 మంది ఓటర్లకే రెండు పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం ఓటర్ల సంఖ్య సుమారు 3,000కు చేరిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచకపోతే రాబోయే ఎన్నికల్లో ఓటర్ల నిరీక్షణ సమయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్య కేవలం బూర్గంపహాడ్ మండలానికి మాత్రమే పరిమితం కాకుండా ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పరిశీలించాల్సిన అంశమని తెలిపారు.
ఎన్నికల సంఘానికి ప్రధాన విజ్ఞప్తులు:
1. ప్రతి 750 మంది పట్టభద్రుల ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి.
2. ఓటర్ల సంఖ్యతో పాటు ప్రాధాన్యతా ఓటు విధానంలో ఒక్కో ఓటరుకు పట్టే సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
3. ఓటర్ల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
4. పోలింగ్ రోజున ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థల్లో సెలవు నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.
5. ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా ముందస్తు ప్రణాళికతో తగిన సదుపాయాలు కల్పించాలి.
ఈ సమస్యపై ప్రస్తుతం నుంచే ఎన్నికల అధికారులు స్పందించి, 2027 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందుగానే పోలింగ్ కేంద్రాల పెంపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని జలగం జగదీష్ కోరారు.
ఓటు హక్కు కల్పించడం ఎంత ముఖ్యమో, ఆ ఓటు హక్కును ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకునే అవకాశం కల్పించడం కూడా అంతే ముఖ్యం. ప్రతి పట్టభద్రుడి ఓటుకు గౌరవం కల్పిస్తూ, పోలింగ్ శాతం పెరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




