Khammam: ఖమ్మంలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ బీఆర్ఎస్ గెలవదు: నూతి సత్యనారాయణ!
Khammam: వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ బీఆర్ఎస్ గెలవదని, ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌కే పట్టం కడతారని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు.
Khammam: ఖమ్మంలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ బీఆర్ఎస్ గెలవదు: నూతి సత్యనారాయణ!
ఖమ్మం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌కే పట్టం కడతారని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.
సోమవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో మిగిలి ఉన్న నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నేతలు మభ్యపెట్టే మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. కనీసం జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి.. ఉట్టికి ఎగరలేనమ్మ తాటిచెట్టుకు ఎగిరినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
పేద కుటుంబాలకు ఇందిరమ్మ బీమా భరోసా
గతంలో ఖమ్మం జిల్లాలో రేషన్ కార్డులు కలిగిన 4,73,275 కుటుంబాలకు అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 62,158 కుటుంబాలకు రేషన్ కార్డులు అందించిందని తెలిపారు. మొత్తం 5,35,433 కుటుంబాలకు తొలి విడతలో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. కుటుంబాలకు ఇప్పటికే ఉన్న బీమా సౌకర్యాలకు అదనంగా ఇందిరమ్మ బీమా భరోసా కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పుకునే ధైర్యం ఉండాలని అన్నారు. కేటీఆర్ పథకాలు అమలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ కొత్త డైలాగులు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను అధికారానికి దూరం చేసిన రోజే ఆ పార్టీ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లయిందని వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌ను రాజకీయాల్లోనే లేకుండా ప్రజలు చేస్తారని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవాకులు, చవాకులు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, ప్రజలకు మేలు జరిగే విలువైన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాలని నూతి సత్యనారాయణ గౌడ్ సూచించారు.




