Bhadrachalam: ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తీరుపై బీఆర్ఎస్ ధర్నాలు!

Bhadrachalam: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వైఖరిపై భగ్గుమన్న బీఆర్ఎస్. చర్ల, దుమ్ముగూడెంలో భారీ ధర్నాలు.. కమీషన్ల దందా, రోడ్ల దుస్థితిపై రావులపల్లి రాంప్రసాద్ ఆగ్రహం.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 18 Sept 2026 5:39 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తీరుపై బీఆర్ఎస్ ధర్నాలు!

భద్రాచలం సెప్టెంబర్ 18: నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకే అధికార పార్టీలోకి వెళ్తున్నా.. నిధుల వరదతో ఏజెన్సీ రూపురేఖలు మారుస్తా.." అంటూ గులాబీ గూడు వదిలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాటలు నీటిమూటలుగానే మిగిలాయి.

పార్టీ మారినా నియోజకవర్గ రాత మారకపోగా, ఎమ్మెల్యే సొంత సామ్రాజ్య విస్తరణ, వ్యక్తిగత ఆర్థిక ఉన్నతే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారంటూ ఏజెన్సీ ప్రజానీకం, ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసిన ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చర్ల మండలం కుదునూరు, దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామాల్లో భారీ ధర్నాలు నిర్వహించారు.

ఈ ఆందోళనల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. నియోజకవర్గంలో నెలకొన్న దుస్థితిపై వారు ధ్వజమెత్తిన ప్రధానాంశాలు:నరకప్రాయంగా ప్రధాన రహదారులు భద్రాచలం నుంచి వాజేడు వరకు విస్తరించిన ప్రధాన రహదారి కనీస మరమ్మతులకు నోచుకోక గుంతలమయంగా మారింది.

అత్యవసర వైద్యం కోసం రోగులను, గర్భిణులను తరలించాలన్నా వాహనాలు నడవలేని దుస్థితి నెలకొంది. నిత్యం వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నా స్థానిక శాసనసభ్యుడికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు.

పీఏల దందా కమీషన్ల రాజ్యం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా కమీషన్ల వసూలు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు, పీఏలు అధికారులు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని, ఎమ్మెల్యే అండదండలతోనే ఈ దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని ధ్వజమెత్తారు.

విచ్చలవిడిగా ఇసుక మాఫియా: గోదావరి తీరంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోందని, ఎమ్మెల్యే సొంత ఏజెంట్లను రంగంలోకి దించి అక్రమ సంపాదనకు తెరలేపారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న భారీ ఇసుక లారీల వల్ల అంతర్గత రోడ్లు ధ్వంసమై, ట్రాఫిక్ సమస్యలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎండిన తాలిపేరు ఆయకట్టు ఏజెన్సీ అన్నదాతల జీవనాడి అయిన తాలిపేరు ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. గేట్ల నిర్వహణ, కాలువల మరమ్మతులను గాలికొదిలేయడంతో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నా ఎమ్మెల్యే నిర్లిప్తత వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ మారితే గ్రామాలు బాగుపడతాయని, కోట్లాది రూపాయల నిధులు వస్తాయని నమ్మిన ప్రజలకు నిరాశే మిగిలిందని నేతలు స్పష్టం చేశారు. నియోజకవర్గ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారగా ఎమ్మెల్యే పరివారం మాత్రమే ఆర్థికంగా బలపడుతోందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి స్వలాభమే పరమావధిగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem