Kothagudem: యూత్ డిక్లరేషన్ హామీలు వెంటనే అమలు చేయాలి!

Kothagudem: కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 Nov 2026 12:50 PM IST
Kothagudem
X

Kothagudem: యూత్ డిక్లరేషన్ హామీలు వెంటనే అమలు చేయాలి!

Kothagudem: యూత్ డిక్లరేషన్ పేరుతో యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ను కలిసి నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలపై 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా హామీల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా, ప్రభుత్వం నుంచి సరైన కార్యాచరణ కనిపించడం లేదన్నారు.

యువతకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ప్రతి హామీ ప్రస్తుత స్థితి, అమలు గడువును వెల్లడించాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్‌కు అందజేసిన వినతిపత్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి, టీజీపీఎస్సీ ప్రక్షాళన, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు, ప్రైవేట్ రంగంలో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి డిమాండ్లు ఉన్నాయని తెలిపారు.

అలాగే యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులకు ప్రత్యేక నియామకాలు చేపట్టాలని కోరారు. పోలీస్ ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షల్లో లాంగ్ జంప్ అర్హత ప్రమాణాన్ని 3.6 మీటర్లకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కిలారు నాగేశ్వర్ రావు,BRS కార్పొరేటర్లు,నాయకులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM