Khammam: పట్టభద్రుల సమస్యలపై బీజేపీ రాజీలేని పోరాటం: రుక్మారావు!
Khammam: ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఖమ్మం బీజేపీ కార్యాలయంలో జిల్లా కార్యశాల నిర్వహించారు.
Khammam: పట్టభద్రుల సమస్యలపై బీజేపీ రాజీలేని పోరాటం: రుక్మారావు!
ఖమ్మం, అక్టోబర్ 2: ఖమ్మం–నల్గొండ–వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సాధారణ ఎన్నిక కాదని, మూడు ఉమ్మడి జిల్లాల్లోని పట్టభద్రుల సమస్యలకు ఎవరు గళం విప్పాలి.. యువత భవిష్యత్తు కోసం ఎవరు పోరాడాలి.. ఉద్యోగాల కోసం ఎవరు ప్రశ్నించాలి.. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ఎవరు నిలబడాలి అనే అంశాలను నిర్ణయించే ఎన్నిక అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుక్మారావు అన్నారు.
శుక్రవారం ఖమ్మం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యశాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రతి పట్టభద్రుడు తన ఓటు విలువను గుర్తించాలని అన్నారు.
ఓటు కేవలం ఒక అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది కాదని, శాసనమండలిలో పట్టభద్రుల తరఫున మాట్లాడే గొంతును నిర్ణయించేదని పేర్కొన్నారు. ఉద్యోగాలు, విద్య, ఉపాధి, యువత భవిష్యత్తు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
నేటి పట్టభద్ర యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉద్యోగమని కోటేశ్వరరావు అన్నారు. డిగ్రీలు, పీజీలు, వృత్తి విద్యా అర్హతలు పూర్తిచేసిన యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. మరోవైపు ప్రైవేటు రంగంలో నాణ్యమైన ఉద్యోగాలు, స్థానికంగా పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
నియామకాలపై నిరంతరం ప్రశ్నించాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తి ఎన్నికల సమయంలో మాత్రమే సమస్యలను ప్రస్తావించే వ్యక్తిగా కాకుండా శాసనమండలిలో నిరంతరం ప్రశ్నించే వ్యక్తిగా ఉండాలని అన్నారు. ఉద్యోగ నియామకాలు, ఖాళీల భర్తీ, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ఫలితాల వేగవంతమైన ప్రకటన, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలి
పట్టభద్రుడైన తర్వాత కూడా యువతకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కోచింగ్, పుస్తకాలు, వసతి వంటి అంశాల్లో ఇబ్బందులు ఉంటున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు పట్టణాల్లో విద్య, వసతి, గ్రంథాలయాలు, డిజిటల్ వనరులు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు.
మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉపాధి అవకాశాలు
ఖమ్మం నుంచి వరంగల్ వరకు, నల్గొండ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు విద్యావంతులైన యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగాలని అన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, సేవారంగం, నూతన వ్యాపారాలకు అవకాశాలు పెంచాలని సూచించారు. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం పెరిగితే విద్యార్థులకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయని అన్నారు.
ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి
అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరుల్లో అర్హులైన పట్టభద్రులకు కూడా ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటరుగా నమోదు కావడం తొలి బాధ్యత అని, అభ్యర్థుల విధానాలు, గత పనితీరును తెలుసుకోవడం తదుపరి బాధ్యత అని పేర్కొన్నారు.
సమస్యలపైనే చర్చ జరగాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వ్యక్తిగత విమర్శలకు బదులుగా పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలని అన్నారు. అభ్యర్థులు గతంలో పట్టభద్రుల కోసం ఏం చేశారు.. ఉద్యోగాల కోసం ఎన్ని సార్లు పోరాడారు.. నిరుద్యోగుల సమస్యలపై ఎక్కడ నిలబడ్డారు.. మూడు ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక ఉంది అనే విషయాలను ప్రజలకు వివరించాలని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కోకనైనర్ యశ్వంత్ , రాష్ట్ర అధికార ప్రతినిధి వాకదాని పుల్లారావు, నంబూరి రామలింగేశ్వర రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొత్త వెంకటేశ్వరరావు, నాయుడు రాఘవరావు, ఉపాధ్యక్షులు రవిరాథోడ్, నకరికంటి వీరభద్రం, మిశ్రా, బండారి నరేష్ , సాంబ , అనిత ,మనీ ,మంద సరస్వతి , అల్లికి అంజయ్య, కొనతం లక్ష్మీనారాయణ, మండలాధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




