Kothagudem: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. విజయమే లక్ష్యంగా కార్యకర్తలు శ్రమించాలని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బోయల వెంకట్ పిలుపు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Oct 2026 7:56 AM IST
Kothagudem
X

Kothagudem: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం!

Kothagudem: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాపలమడుగు రాకేష్ బాబు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం–నల్గొండ–వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం లక్ష్మీదేవి పల్లి లోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయల వెంకట్ , జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి పార్టీ విధానాలను వివరించాలని, ప్రతి కార్యకర్త ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయల వెంకట్ మాట్లాడుతూ ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఎస్సీ వర్గాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాపలమడుగు రాకేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ మోర్చాను మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా కమిటీ పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకుగా వ్యవహరిస్తూ పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.

పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వహిస్తూ, సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. ఎస్సీ వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎస్సీ మోర్చా నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు. జిల్లా కమిటీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు చేరువ కావాలని, సేవా కార్యక్రమాల ద్వారా పార్టీ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రామవరంలోని అంబేద్కర్ కాలనీ సమీపంలో గల పెద్దమ్మ గుడి (సమ్మక్క-సారక్క ) గద్దెల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నాయకులు సూచించారు.

స్వచ్ఛమైన సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉందని, సేవా సంకల్ప అభియాన్ స్ఫూర్తితో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని ఎస్సీ మోర్చా నాయకులు పేర్కొన్నారు.

అనంతరం ఎస్సీ మోర్చా జిల్లా కమిటీ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకొని, పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణ, జిల్లాలో ఎస్సీ మోర్చా బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

కమిటీ సభ్యుల మధ్య సమన్వయం, ఐక్యత, స్నేహభావం మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు.ఆత్మీయ వాతావరణంలో సమావేశాన్ని ముగించారు.

ఈ కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమం, జిల్లా కమిటీ సభ్యుల మధ్య ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్