Kothagudem: కొత్తగూడెంలో కాంగ్రెస్ ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ!
Kothagudem: లక్ష్మీదేవిపల్లిలో బీజేపీ మహిళా మోర్చా నిరసన. మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చ భీమల్ దిష్టిబొమ్మ దహనం. ఎంపీని సస్పెండ్ చేయాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్.
Kothagudem: కొత్తగూడెంలో కాంగ్రెస్ ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ!
Kothagudem: మణిపూర్‌కు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు అంగోమ్చ భీమల్ అకోజైమ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో సోమవారం లక్ష్మీదేవిపల్లి ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి మాట్లాడుతూ.. మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. విద్యార్థినులు, మహిళల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించకూడదని పేర్కొన్నారు.
మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకత్వం, తమ పార్టీ ఎంపీపై వచ్చిన ఆరోపణల విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై న్యాయం జరిగే వరకు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న నాయక్, జిల్లా ఉపాధ్యక్షురాలు, మూడో డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మువ్వ అపర్ణ, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఆకునూరి పద్మ, మహిళా మోర్చా ఐటీ కన్వీనర్ పోలే మనశ్విని, అధికార ప్రతినిధి భోగాలక్ష్మి, కార్యవర్గ సభ్యురాలు కుసుమ భవాని తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




