Kothagudem: నిమజ్జన శోభాయాత్రకు రోడ్ల మరమ్మతులు చేపట్టాలి: బీజేపీ!
Kothagudem: గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు రోడ్ల మరమ్మతులు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి: మేయర్‌కు వినతిపత్రం అందజేసిన కొత్తగూడెం బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్.
Kothagudem: నిమజ్జన శోభాయాత్రకు రోడ్ల మరమ్మతులు చేపట్టాలి: బీజేపీ!
కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను దృష్టిలో ఉంచుకొని రోడ్ల మరమ్మతులు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణమే ఏర్పాటు చేయాలని బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ కోరారు.
ఈ మేరకు బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ.. నిమజ్జన శోభాయాత్రలో వేలాది మంది భక్తులు, ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రధాన నిమజ్జన మార్గాల్లో ఉన్న గుంతలను వెంటనే పూడ్చి రోడ్లను ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని, శోభాయాత్ర సమయంలో ప్రత్యేక ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు వంటి అత్యవసర వాహనాలకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని కోరారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అవసరమైన ప్రాంతాల్లో బైపాస్ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నిమజ్జన మార్గంలో వీధి దీపాలు, తాగునీరు, పారిశుద్ధ్య సిబ్బంది, చెత్త బుట్టలు వంటి మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని కోరారు.
గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో సజావుగా జరిగేలా మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ తదితర శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కనుకుంట్ల రాజా మొగిలి, పట్టణ ప్రధాన కార్యదర్శి చంద్రగిరి రమేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు హృదయ్, నాయకులు భాస్కర్ గౌడ్, గిరి తదితరులు పాల్గొన్నారు.




