Khammam: భారత్ సమ్మిట్‌లో విదేశీ నేత వ్యాఖ్యలపై ఖమ్మం సీపీకి బీజేపీ ఫిర్యాదు!

Khammam: భారత్ సమ్మిట్ 2026 వేదికగా విదేశీ నేత జియాకోమో ఫిలిబెక్ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం బీజేపీ నాయకులు పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌కు ఫిర్యాదు చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 18 Nov 2026 8:24 AM IST
Khammam
X

Khammam: భారత్ సమ్మిట్‌లో విదేశీ నేత వ్యాఖ్యలపై ఖమ్మం సీపీకి బీజేపీ ఫిర్యాదు!

Khammam: హైదరాబాద్‌లో జరిగిన 'భారత్ సమ్మిట్ 2026' వేదికగా విదేశీ రాజకీయ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు దేశ సార్వభౌమత్వానికి, ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖమ్మం జిల్లా శాఖ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను కలిసి ఈ మేరకు అధికారిక ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, నవంబర్ 14న హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో 'పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్' (PES) సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్ పాల్గొని భారత అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకునే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

సదస్సులో ఆయన "ఓట్ చోర్, గద్దీ ఛోడ్" అంటూ రాజకీయ నినాదాలు చేయడమే కాకుండా, దానిని ఆంగ్లంలోకి అనువదించి భారత ఎన్నికల ప్రక్రియను కించపరిచేలా ప్రసంగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత భూభాగంలోకి ప్రవేశించే ప్రతి విదేశీ పౌరుడు దేశ చట్టాలు, వీసా నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు.

జియాకోమో ఫిలిబెక్ ఏ కేటగిరీ వీసాపై భారత్‌కు వచ్చారు, ఆయన పర్యటన ఉద్దేశం ఏమిటనే దానిపై నిష్పక్షపాత విచారణ జరపాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) భద్రతా అనుమతులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నుండి పొలిటికల్ క్లియరెన్స్ తీసుకున్నారా లేదా అనే అంశాలను లోతుగా పరిశీలించాలని కోరారు.

విదేశీ నేతను ఆహ్వానించి, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రసంగాలకు వేదిక కల్పించిన సదస్సు నిర్వాహకులు, స్పాన్సర్లు మరియు సమన్వయకర్తల పాత్రపై 'ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025' కింద కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత ఆధారాలను భద్రపరిచి, ఈ ఉల్లంఘనలపై తక్షణమే కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్ దత్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వర రావు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యాంసుందర్ నాయక్, ఉపాధ్యక్షులు నకరికంటి వీరభద్రం ,రవి రాథోడ్, కోశాధికారి లక్ష్మీనారాయణ గుప్తా మోర్చా అధ్యక్షులు శాసన సాయిరాం,, మంద సరస్వతి, రీగన్ ప్రతాప్, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, పృథ్వీ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.