Kothagudem: ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు సరికావు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశం. ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ అసత్య ప్రచారాలను ఖండించారు.
Kothagudem: ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు సరికావు!
Kothagudem: ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై నిరాధార ఆరోపణలు చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.
రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై బురదజల్లడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లను తొలగించి, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రక్రియను చూసి కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన మొదలైందని ఆరోపించారు. గతంలో జరిగిన అక్రమాలు, బోగస్ ఓట్లు బయటపడతాయనే భయంతోనే అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో గెలిస్తే వ్యవస్థలు బాగున్నాయని, ఓటమి ఎదురయ్యే పరిస్థితి వస్తే ఎన్నికల సంఘం, ఈవీఎంలపై ఆరోపణలు చేయడం కాంగ్రెస్కు పరిపాటిగా మారిందన్నారు. ఇది ఆ పార్టీ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకులకు తమ ఆరోపణలపై నిజంగా నమ్మకం ఉంటే తగిన ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని బైరెడ్డి సవాల్ విసిరారు. ఆరోపణలను నిరూపించలేకపోతే ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు, గందరగోళ ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు వెళ్లి వాస్తవాలను వివరిస్తాయని తెలిపారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు నవీన్, చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మోహన్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోల హరీష్, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు మంగీలాల్ నాయక్, ఎస్సీ మోర్చా కార్యదర్శి మహంకాళి శంకర్ తదితరులు పాల్గొన్నారు.




