Palwancha: ప్రతిపక్షాలను చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు: కూనంనేని

Palwancha: పాల్వంచ సీపీఐ కౌన్సిల్ సమావేశంలో ఆదివారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బీజేపీ కుట్రలు, డీలిమిటేషన్, ఓట్ల తొలగింపుపై విమర్శలు గుప్పించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 29 Nov 2026 9:19 PM IST
Palwancha
X

Palwancha: ప్రతిపక్షాలను చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు: కూనంనేని

పాల్వంచ: ప్రతిపక్షాలను ఎదుర్కొనే సత్తా లేని బీజేపీ, వాటిని చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఆదివారం పాల్వంచలోని సీఆర్ భవన్‌లో నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని ఆరోపించారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో దేశంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

డీలిమిటేషన్ పేరుతో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందన్నారు. జనాభా నియంత్రణ, విద్య, వైద్య రంగాల్లో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానం వల్ల రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య పెంచే ప్రయత్నాలు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగించకూడదన్నారు.

ముందుగా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు పూర్తి చేసి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డీలిమిటేషన్‌పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యానికి గండి కొట్టే విధంగా చర్యలు ఉండకూడదని హితవు పలికారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పెద్ద బూటకమని, రాజకీయ లబ్ధి కోసం ఓట్ల తొలగింపుతో బీజేపీ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దేశంలో 13 కోట్లకు పైగా అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. రానున్న ఎన్నికల్లో సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు.

అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్కే సాబీర్ పాషా మాట్లాడుతూ, జనవరి తర్వాత జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించనున్న ఈ పాదయాత్ర పాలకులకు కనువిప్పు కలిగించాలని అన్నారు. జిల్లాలోని ముగ్గురు మంత్రులు జిల్లా పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. పోటీపడి పర్యటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి గోదావరి జలాలను జిల్లా నుంచి తరలించుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే జైల్ భరో కార్యక్రమం, డిసెంబర్ నెలాఖరులో జరిగే మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలు, డిసెంబర్ 10న మణుగూరులో నిర్వహించే జిల్లా మహాసభలు, డిసెంబర్ 26న జరిగే సీపీఐ 101వ ఆవిర్భావ వేడుకలు, జనవరి చివరి వారంలో భద్రాచలంలో జరిగే అఖిల భారత ఆదివాసీ మహాసభలను విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి, ఉదయభాస్కర్, మున్నా, లక్ష్మీకుమారి, మూడు గణేష్, రేసు ఎల్లయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జి. వీరస్వామి, భూక్య దశ్రు, కందుల భాస్కర్, ఎస్కే ఫహీం తదితర జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN