Bhadradri: సారపాక రైల్వే లైన్ పనులకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ!

Bhadradri: పాండురంగాపురం-సాకేతపురి (సారపాక) రైల్వే లైన్ ప్రారంభానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో సానుకూల స్పందన.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 21 Sept 2026 7:56 AM IST
Bhadradri
X

Bhadradri: సారపాక రైల్వే లైన్ పనులకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ!

Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం ప్రాంత ప్రజల చిరకాల రైల్వే కల సాకారం దిశగా కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. పాండురంగాపురం–సాకేతపురి (సారపాక) రైల్వే లైన్ పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు హామీ ఇచ్చారు. ఇటీవల మంత్రి తుమ్మల రాసిన లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి ఫోన్‌లో మాట్లాడి, పెండింగ్‌లో ఉన్న రైల్వే అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

భద్రాద్రి యాత్రికులకు మరింత సౌకర్యం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి దేశవ్యాప్తంగా భక్తులు, యాత్రికులు వస్తుంటారని మంత్రి తుమ్మల కేంద్ర మంత్రికి వివరించారు. పాండురంగాపురం–సాకేతపురి (సారపాక) రైల్వే లైన్ పూర్తయితే భద్రాచలం వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. భద్రాద్రి ప్రాంత అభివృద్ధికి, యాత్రికుల సౌకర్యానికి ఈ రైల్వే మార్గం ఎంతో కీలకమని పేర్కొంటూ పనులను వేగవంతం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన అశ్విని వైష్ణవ్ పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సత్తుపల్లి–కొవ్వూరు రైల్వే లైన్‌కు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి

సత్తుపల్లి–కొవ్వూరు రైల్వే లైన్ ఇప్పటికే రైల్వే బడ్జెట్‌లో ప్రకటించబడినప్పటికీ, నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని మంత్రి తుమ్మల కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదే సమయంలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రైల్వే లైన్ నిర్మాణం ఇప్పటికే చేపట్టిన విషయాన్ని మంత్రి తుమ్మల వివరించారు. కొత్తగూడెం–సత్తుపల్లి రైల్వే అనుసంధానం ఉన్న నేపథ్యంలో సత్తుపల్లి–కొవ్వూరు మార్గం పూర్తయితే ఈ ప్రాంతం మరింత విస్తృత రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతుందని తెలిపారు.

పెనుబల్లి–కొండపల్లి (అమరావతి) కొత్త రైల్వే మార్గానికి మంజూరు కోరిన మంత్రి తుమ్మల

పెనుబల్లి నుంచి కొండపల్లి (అమరావతి) వరకు కొత్త రైల్వే మార్గాన్ని మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. ఈ మార్గం ఏర్పాటుతో ఉమ్మడి ఖమ్మం ప్రాంతం నుంచి అమరావతి వైపు ప్రయాణించే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని వివరించారు.

సత్తుపల్లి–కొవ్వూరు మార్గానికి నిధుల మంజూరు, పెనుబల్లి–కొండపల్లి (అమరావతి) కొత్త రైల్వే మార్గం మంజూరుకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను పంపిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు.

భద్రాద్రి–ఉమ్మడి ఖమ్మం ప్రాంత అభివృద్ధికి రైల్వే అనుసంధానం కీలకం

పాండురంగాపురం–సాకేతపురి (సారపాక) రైల్వే లైన్ పనులు ప్రారంభం, సత్తుపల్లి–కొవ్వూరు రైల్వే లైన్‌కు నిధుల మంజూరు, పెనుబల్లి–కొండపల్లి (అమరావతి) కొత్త రైల్వే మార్గానికి మంజూరు లభిస్తే భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఖమ్మం ప్రాంతాల రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. యాత్రికులు, ప్రయాణికులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కూడా ఈ రైల్వే అనుసంధానాలు ప్రయోజనం చేకూర్చనున్నాయి.

మంత్రి తుమ్మల చేసిన విజ్ఞప్తులకు కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి ప్రత్యేక బృందాలను పంపిస్తామని, సంబంధిత అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం పట్ల ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.