Kothagudem: పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి ఎస్పీ రోహిత్ రాజు
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్ రాజు అధ్యక్షతన నేర సమీక్ష. NBWలు, NDPS కేసులు, గంజాయి నివారణపై కఠిన ఆదేశాలు.
Kothagudem: పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అధ్యక్షతన నెలవారీ నేర సమీక్ష సమావేశం మంగళవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నేర పరిస్థితులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, కోర్టు సంబంధిత అంశాలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో నేరస్తులకు శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం అందించాలని ఎస్పీ ఆదేశించారు. హత్య కేసులకు సంబంధించిన పెండింగ్ దర్యాప్తులను త్వరితగతిన పూర్తి చేసి, పటిష్టమైన ఆధారాలు సేకరించాలని సూచించారు.
దర్యాప్తులో జాప్యం, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు.పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. స్టేషన్ వారీగా వారెంట్ల అమలును సమీక్షిస్తూ పెండింగ్ సంఖ్యను తగ్గించాలని సూచించారు.
ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితుల ఆర్థిక మూలాలను గుర్తించి సమగ్ర ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని, అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి చట్టపరంగా జప్తు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిఐటి ఎన్డిపిఎస్ కింద నిర్బంధ ప్రతిపాదనలు, పెండింగ్ అంశాలు, తాజా అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నేరస్తులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, గంజాయి వినియోగదారులను గుర్తించి వైద్యుల సూచనల మేరకు డి-అడిక్షన్ సెంటర్లకు తరలించాలని ఆదేశించారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ భరోసా కేంద్రం, షీ-టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మహిళలపై నేరాలు, పోక్సో, ఎస్సీ/ఎస్టీ, మిస్సింగ్ కేసులు, రౌడీ షీట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీసీటీవీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి డైల్-112 ఫిర్యాదులపై తక్షణ స్పందన అందించాలని తెలిపారు.
ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్‌తో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




