Palvancha: ప్రజావాణి అర్జీలను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్!

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

Rohith
Published on: 2 Nov 2026 5:14 PM IST
Palvancha
X

Palvancha: ప్రజావాణి అర్జీలను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్!

పాల్వంచ, నవంబర్ 2: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, గృహాలు, ఉపాధి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ పదేపదే తిరిగే పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అర్హతలు, నిబంధనల ప్రకారం సత్వర పరిష్కారం చూపాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

ఒక శాఖకు సంబంధించిన సమస్య పరిష్కారానికి ఇతర శాఖల సహకారం అవసరమైతే సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు, దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు అర్జీలు సమర్పించే సమయంలో పూర్తి వివరాలు, సంబంధిత ఆధార పత్రాలను జతచేయాలని కలెక్టర్ కోరారు.

పాల్వంచ మండలానికి చెందిన వై. నాగలక్ష్మి తన భర్త ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందారని, కుటుంబ పోషణకు ఆధారమైన రేషన్ కార్డును అధికారులు రద్దు చేశారని కలెక్టర్‌కు విన్నవించారు. రేషన్ కార్డును తిరిగి మంజూరు చేయాలని కోరగా, ఈ దరఖాస్తును డీసీఎస్ఓకు పంపించారు.

అశ్వారావుపేట మండలం నందిపాడు ప్రాంతానికి చెందిన బత్తుల జానకమ్మ తనకు గతంలో అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద రేషన్ అందేదని, ప్రస్తుతం నిలిపివేశారని తెలిపారు. తాను వితంతువునని, సంతానం కూడా లేదని పేర్కొంటూ తిరిగి ఏఏవై రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరారు. ఈ అర్జీని డీసీఎస్ఓకు ఎండార్స్ చేశారు.

లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చాతకొండ ఎస్సీ కాలనీకి చెందిన మేక రజని తన భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తున్నామని తెలిపారు. రోజువారీ కూలి పనులపై ఆధారపడిన తమ కుటుంబానికి పనులు సరిగా లభించక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరారు. ఈ దరఖాస్తును తహసీల్దార్‌కు పంపించారు.

కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని సఫాయి బస్తీకి చెందిన మహమ్మద్ జరీనా బేగం తాను పోలియో బాధితురాలినని, 2023లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో లాటరీ ద్వారా తనకు 602 నంబర్ ప్లాట్ కేటాయించినట్లు తెలిపారు. అద్దె భారం కారణంగా మరో ప్రాంతానికి మారిన సమయంలో అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు సరైన సమాచారం అందకపోవడంతో తనకు కేటాయించిన ఇంటిని రద్దు చేశారని వివరించారు. గతంలో కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని తిరిగి మంజూరు చేయాలని కోరగా, ఈ అర్జీని పీడీ హౌసింగ్‌కు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Rohith

Rohith