Mulakalapally: అన్నదాతలకు చట్టాలపై అవగాహన అత్యవసరం: జడ్జి ఎం. రాజేందర్!
Mulakalapally: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి రైతు వేదికలో గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం. రాజేందర్ రైతులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
Mulakalapally: అన్నదాతలకు చట్టాలపై అవగాహన అత్యవసరం: జడ్జి ఎం. రాజేందర్!
ముల్కలపల్లి: రైతులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం. రాజేందర్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ముల్కలపల్లి మండలంలోని రైతు వేదికలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రైతులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తన చట్టం ప్రకారం నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని, నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదులు తీసుకొని భద్రపరచుకోవాలని తెలిపారు. నాణ్యతలేని విత్తనాల వల్ల పంట నష్టం జరిగితే చట్టపరంగా పరిహారం పొందేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.
అనంతరం బాల్య వివాహాల నిరోధక చట్టంపై మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండని బాలికలకు, 21 సంవత్సరాలు నిండని బాలురకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుతో పాటు బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ.. పిల్లలను లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షించేందుకు ఈ చట్టం అమలులో ఉందని వివరించారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు సూరిబాబు, రాహుల్ గాంధీ, సుజాత, సీడీపీవో లలిత, ఎయిడ్ ఎన్జీవో ప్రతినిధులు జ్యోతి, మౌనిక, ముల్కలపల్లి సర్పంచ్ చంద్రలేఖ, మాధారం సర్పంచ్ సుజాత, వీకే రామవరం సర్పంచ్ ఊకే ఆదిలక్ష్మి, పారాలీగల్ వాలంటీర్లు వీరభద్రం, భిక్షమయ్య, జానకిరాం, రైతులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




