Kothagudem: పాములేరుపై హైలెవల్ వంతెన ప్రారంభం

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాములేరు హైలెవల్ వంతెన ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్ట్ పనుల పరిశీలన.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 21 Sept 2026 4:59 PM IST
Kothagudem
X

Kothagudem: పాములేరుపై హైలెవల్ వంతెన ప్రారంభం

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ములకలపల్లి మండలం చాపరాలపల్లి వద్ద పాములేరుపై రూ. 4.63 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన హైలెవల్ వంతెనను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కమలాపురం సమీపంలోని సీతారామ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్-3ని సందర్శించి పనుల పురోగతిపై సమీక్ష జరిపారు.

కమలాపురం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంప్‌హౌస్-3ని సందర్శించిన సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదినారాయణ నియోజకవర్గానికి గోదావరి నీటిని మళ్లించేందుకు ఆయన చేతుల మీదుగానే మోటార్ ఆన్ చేసి, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి (అన్నదైవం) ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి విడుదలను ప్రారంభించినట్లు తెలిపారు.

రాబోయే 20 నుండి 25 రోజుల్లో టన్నెల్ లైనింగ్, కెనాల్ లైనింగ్ మరియు రోడ్డు క్రాసింగ్స్ పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల చేతుల మీదుగా సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో పంపించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

భూసేకరణ పరిపరిష్కారాల నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రూ. 45 కోట్లు విడుదల చేశారని, అవసరమైతే కలెక్టర్ ప్రతిపాదనల మేరకు మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు క్షీణించి భూగర్భ జలాలు పడిపోయాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకే గోదావరి జలాలను తరలిస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో తీవ్రతను 'జాతీయ విపత్తు' గా పరిగణించి తెలంగాణకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం జలవిద్యుత్ (హైడల్ పవర్) లభ్యత లేకపోవడంతో పూర్తిగా థర్మల్ విద్యుత్‌పైనే ఆధారపడి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా జరుగుతోందని, రాబోయే నెల రోజుల్లో సాగునీటి పంపిణీకి ఎలాంటి విద్యుత్ కొరత రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్, ఇతర ప్రజాప్రతినిధులు మరియు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN