Kothagudem: ఇందిరమ్మ బీమా అమలుపై అధికారులకు శిక్షణ
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై పంచాయతీ కార్యదర్శులు, ఆపరేటర్లకు అదనపు కలెక్టర్ విద్యా చందన శిక్షణనిచ్చారు.
Kothagudem: ఇందిరమ్మ బీమా అమలుపై అధికారులకు శిక్షణ
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం విజయవంతానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అధికారులను ఆదేశించారు. పథకం అమలులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులైన కుటుంబాల వివరాలను ఖచ్చితంగా సేకరించి నమోదు చేయాలని సూచించారు.
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జె. సునీత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ, కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా ఉన్న సంపాదనపరుడు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల జీవిత బీమా పరిహారం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పథక మార్గదర్శకాల ప్రకారం అర్హులైన కుటుంబాలను గుర్తించి నమోదు చేయాలని, కులం, ఆదాయం, ఏపీఎల్, బీపీఎల్ వంటి అంశాలతో సంబంధం లేకుండా నిర్దేశించిన అర్హతల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. బీమా పొందే వ్యక్తి వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకొని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అన్నారు. అర్హులైన కుటుంబాల వివరాలను నిర్దేశించిన విధానంలో సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యులు, నామినీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నామినీ మైనర్ అయితే సంరక్షకుడి వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. దరఖాస్తులో పొందుపరిచిన వివరాలను బీమాదారుడికి చదివి వినిపించి, సరిచూసిన అనంతరం ఆయన సంతకం తీసుకోవాలని తెలిపారు.
గ్రామాల్లో నిర్వహించే శిబిరాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ సదుపాయాలతో పాటు టెంట్లు, కుర్చీలు, తాగునీరు, మైక్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దరఖాస్తుదారులకు సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మార్గనిర్దేశం చేసే సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీ మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు.
రేషన్ కార్డుల ఆధారంగా అందుబాటులో ఉన్న ప్రీ-ఫిల్డ్ డేటాను ఉపయోగించుకొని దరఖాస్తులు నింపాలని, రేషన్ కార్డులు లేని కుటుంబాల వివరాలను ప్రత్యేక ఖాళీ దరఖాస్తుల ద్వారా సేకరించాలని తెలిపారు. ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేయాలని, శిక్షణలో అందించిన సూచనలు, సాంకేతిక అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ-డీఎం సైదేశ్వరరావు సమావేశంలో ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా చేసి చూపించారు. నమూనా దరఖాస్తును నింపుతూ ప్రీ-ఫిల్డ్ డేటా పరిశీలన, బీమాదారుడు, నామినీల వివరాల నమోదు విధానాన్ని వివరించారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. నమోదైన దరఖాస్తులను స్కాన్ చేసి సంబంధిత బీమా సంస్థకు పంపించాలని, అసలు దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయంలో భద్రపరచాలని సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.




