Kothagudem: గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: ఎస్పీ రోహిత్ రాజు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేష్ నిమజ్జనానికి 1,000 మందితో భారీ బందోబస్తు: ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. డీజేలు నిషేధం, డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యల హెచ్చరిక.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 22 Sept 2026 4:51 PM IST
Kothagudem
X

Kothagudem: గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: ఎస్పీ రోహిత్ రాజు!

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రకటన ద్వారా తెలిపారు.

గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిమజ్జన శోభాయాత్రలు జరిగే ప్రధాన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.భద్రాచలం నిమజ్జనం ఘాట్ వద్ద పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు.

భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఘాట్ పరిసరాల్లో పోలీస్ సిబ్బందిని అధిక సంఖ్యలో మోహరించి, రద్దీ నియంత్రణ, వాహనాల రాకపోకలు, పార్కింగ్, శోభాయాత్రల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల మళ్లింపు, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు.శోభాయాత్రల్లో డీజేలు, అధిక శబ్దాన్ని కలిగించే సౌండ్ సిస్టమ్స్, టపాసులకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని, నిమజ్జన సమయంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు, రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన నీటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో బ్లూకోట్స్, మొబైల్ పెట్రోలింగ్, ట్రాఫిక్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీస్, అగ్నిమాపక, వైద్య, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు.

గణేష్ మండపాల నిర్వాహకులు, శోభాయాత్ర నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, శోభాయాత్ర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు.గణేష్ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM