Palwancha: పాల్వంచ కేటీపీఎస్‌ను పరిశీలించిన బీఆర్‌ఎస్ నేతలు!
Palwancha: పాల్వంచ కేటీపీఎస్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నేతలు.. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తోందని తీవ్ర ఆరోపణ.
Palwancha: పాల్వంచ కేటీపీఎస్‌ను పరిశీలించిన బీఆర్‌ఎస్ నేతలు!
Palwancha: రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరాపై నిజానిజాలు తేల్చేందుకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గురువారం పాల్వంచ కేటీపీఎస్‌ను బీఆర్‌ఎస్ నేతలు సందర్శించారు. ప్లాంట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు తొలుత అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తదితరులను ప్లాంట్‌లోకి అనుమతించారు.
ప్లాంట్‌ను పరిశీలించిన అనంతరం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు పెరిగాయని విమర్శించారు. సింగరేణి నుంచి ప్లాంట్లకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం, సకాలంలో నాణ్యమైన బొగ్గు అందకపోవడం వల్లే విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు, వ్యాపారులు, పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రవిచంద్ర అన్నారు. విద్యుత్ ఉంటే నీళ్లు, నీళ్లు ఉంటే పంటలు పండుతాయని పేర్కొంటూ, ప్రభుత్వం విద్యుత్ రంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి సాగునీటి రంగానికి ఊతమిచ్చామని, యాదాద్రి పవర్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం వంటి ఎన్నికల హామీల అమలులోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రవిచంద్ర విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గడానికి కారణాలు, బొగ్గు సరఫరా పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.




