Aswaraopeta: తిరుమలకుంటలో అడవి పంది మాంసంతో ముగ్గురు వ్యక్తుల పట్టివేత!
Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట బీట్ పరిధిలో అడవి పంది మాంసాన్ని కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు.
Aswaraopeta: తిరుమలకుంటలో అడవి పంది మాంసంతో ముగ్గురు వ్యక్తుల పట్టివేత!
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దమ్మపేట అటవీ రేంజ్ పరిధిలోని తిరుమలకుంట బీట్‌లో అడవి పందిని వేటాడి దాని మాంసాన్ని కలిగి ఉన్నారనే సమాచారం అటవీ శాఖ అధికారులకు అందింది. వెంటనే అటవీ శాఖ సిబ్బంది తిరుమలకుంట గ్రామానికి చెందిన కారం రాంబాబు వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించగా, సుమారు 1.5 కిలోల అడవి పంది మాంసంతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు.
వారి వివరాలు:
కారం రాంబాబు – తిరుమలకుంట. మోదియం వెంకటేష్ – కోర్సగూడెం. మడకం ముత్యాలరావు – బోరియాలగుట్ట.
విచారణలో వారు తెలిపిన వివరాల ప్రకారం, కారం రాంబాబుకు చెందిన వ్యవసాయ భూమిలోకి అడవి పంది ప్రవేశించగా, అతని పెంపుడు కుక్కలు దానిని తరిమి చంపినట్లు తెలిపారు. అనంతరం కుక్కలు కొంత మాంసాన్ని తినగా, మిగిలిన మాంసాన్ని ముగ్గురు వ్యక్తులు పంచుకున్నట్లు విచారణలో వెల్లడించారు.
ఈ సంఘటనకు సంబంధించి అటవీ శాఖ అధికారులు సుమారు 1.5 కిలోల అడవి పంది మాంసాన్ని స్వాధీనం చేసుకొని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం సంబంధిత నిబంధనల కింద అటవీ నేర కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతోంది.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అడవి జంతువులను వేటాడటం, చంపడం, వాటి మాంసాన్ని కలిగి ఉండటం, రవాణా చేయడం లేదా వినియోగించడం చట్టరీత్యా నేరమని తెలియజేశారు.
వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హెచ్చరించింది. వన్యప్రాణులకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు గుర్తించినట్లయితే వెంటనే సమీప అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరింది.




