Kothagudem: కొత్తగూడెంలో వ్యాక్సినేషన్, RBSK కార్యక్రమాల తనిఖీ!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో ఆరోగ్య కార్యక్రமాలను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రతాప్ తనిఖీ చేశారు. కంటి పరీక్షలు, వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 29 Oct 2026 6:22 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో వ్యాక్సినేషన్, RBSK కార్యక్రమాల తనిఖీ!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును మెరుగుపరిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (Dy. DM&HO), జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (DIO) డా. ప్రతాప్ గురువారం జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాలను సందర్శించి వివిధ కార్యక్రమాల అమలును పరిశీలించారు.

పాలకొయ తండా, నవభారత్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK) కంటి పరీక్షలను పరిశీలించారు. చిన్నారుల్లో కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

అనంతరం బీడీకే చిట్టిరామవరం కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు. ఇటీవల కేంద్రానికి సంబంధించి అందిన ఫిర్యాదులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వైద్య సేవలు అందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం (MCH)లోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (DEIC), స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ (SNCU), జీరో డోస్ వ్యాక్సినేషన్ గదులను పరిశీలించారు. చిన్నారుల్లో అభివృద్ధి, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సంరక్షణ అందించడం, ఇప్పటివరకు ఒక్క టీకా కూడా తీసుకోని పిల్లలను గుర్తించి టీకాలు వేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పాత కొత్తగూడెం పరిధిలోని గోల్లగూడెంలో నిర్వహిస్తున్న మీజిల్స్–రుబెల్లా (MR) నిర్మూలన ప్రచార ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని కూడా డా. ప్రతాప్ పర్యవేక్షించారు. అర్హులైన చిన్నారులందరికీ టీకాలు అందేలా చూడాలని, టీకాలు తీసుకోని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు సూచించారు. టీకాల వివరాలను రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు.

ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించేందుకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని డా. ప్రతాప్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో SNCU మెడికల్ ఆఫీసర్ డా. వినోద్, CHO నాగభూషణం, DPO సలితతో పాటు సంబంధిత వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM