Annapureddypally: అన్నపురెడ్డిపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ సుడిగాలి పర్యటన!

Annapureddypally: అన్నపురెడ్డిపల్లిలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు నరసాపురంలో భూ రీ సర్వే పరిశీలన గురుకుల పాఠశాలల్లో ఆహార నాణ్యత, భద్రతపై ఆరా, ఫుడ్ పాయిజనింగ్‌పై హెచ్చరికలు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 29 Sept 2026 5:05 PM IST
Annapureddypally
X

Annapureddypally: అన్నపురెడ్డిపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ సుడిగాలి పర్యటన!

అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించి భూ రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, గురుకుల విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా నరసాపురం గ్రామ పరిధిలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, అనంతరం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల, తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను తనిఖీ చేసి భూ రీ సర్వే పురోగతి, విద్యార్థులకు అందుతున్న వసతులు, ఆహార నాణ్యత, పారిశుధ్యం, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నరసాపురం గ్రామ పరిధిలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ అంకిత్, సర్వే సిబ్బంది, తహసీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ విస్తీర్ణం, గ్రామ సరిహద్దులు, పట్టా భూములు, వివిధ సర్వే నంబర్లకు సంబంధించిన వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. భూ రీ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన విస్తీర్ణం, హక్కుదారు, సంబంధిత శాఖ వివరాలను రెవెన్యూ, సర్వే, అటవీ, ఇతర సంబంధిత శాఖల రికార్డులతో సమగ్రంగా సరిపోల్చి నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు.

నరసాపురం గ్రామంలో సుమారు 1,058 ఎకరాల భూమి, సుమారు 13.5 కిలోమీటర్ల గ్రామ సరిహద్దు ఉన్న నేపథ్యంలో సరిహద్దుల నిర్ధారణతో పాటు భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన గ్రామసభలో వచ్చిన అంశాలను కూడా పరిశీలించాలని తెలిపారు. అన్నదైవం ప్రాజెక్టుకు సంబంధించిన భూములు, సర్వే నంబర్ 47లోని ఎండోమెంట్/దేవాదాయ భూముల వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించాలని ఆదేశించారు.

సర్వే నంబర్ 39 లోని సుమారు 264 ఎకరాల భూమికి సంబంధించి ఖచ్చితమైన హక్కుదారు, సంబంధిత శాఖ వివరాలను రికార్డుల ఆధారంగా నిర్ధారించాలని కలెక్టర్ సూచించారు. ఈ భూమికి సంబంధించి అటవీ శాఖ ఆక్రమణ ఉందంటూ వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో రెవెన్యూ, అటవీ శాఖ రికార్డులను పరస్పరం పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్ 40లోని సుమారు 200 ఎకరాల భూమికి సంబంధించిన దానం/దత్తత వివరాలు, హక్కులు, బదలాయింపు రికార్డులను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను నిబంధనల ప్రకారం పరిశీలించి పారదర్శకంగా రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.

అనంతరం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటశాల, స్టోర్ రూమ్, విద్యార్థులకు అందించేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, రాగిజావ, చికెన్ తదితర ఆహార పదార్థాలు అందుతున్నాయా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, వంటశాలలో పరిశుభ్రత పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. బియ్యం, పప్పులు తదితర నిత్యావసర సరుకుల నిల్వలను తనిఖీ చేసి నాణ్యత, నిల్వ విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న మెనూ, అల్పాహారం, రాగిజావ, చికెన్ తదితర ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, విద్యా సామగ్రి, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అదేవిధంగా తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కూడా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, వారికి అందుతున్న ఏకరూప దుస్తులు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలోని ప్రహరీ, విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాలికల గురుకులంలోని వంటశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందించేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని, మెనూ అమలు తీరును, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. బియ్యం, పప్పులు తదితర సరుకులను కప్పి, సురక్షితంగా నిల్వ చేయాలని, వంటశాలలో పరిశుభ్రతను నిరంతరం పాటించాలని ఆదేశించారు. వంటశాలలో బల్లులు, ఎలుకలు, ఇతర కీటకాలు ప్రవేశించకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని, ఆహార కలుషితానికి, ఫుడ్‌ పాయిజనింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురుకుల విద్యాసంస్థల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించాలని, పాములు, విషపూరిత జంతువులు ప్రవేశించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల మధ్య ఏవైనా సమస్యలు, వివాదాలు తలెత్తితే సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం కల్పిస్తున్న ప్రతి సౌకర్యం, పథకం పూర్తి స్థాయిలో వారికి అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో తహసీల్దార్ స్వర్ణ, ఆయా గురుకులాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్వే సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU