Kothagudem: ఓటర్ల జాబితా సవరణ అర్హులకు మరో అవకాశం - కలెక్టర్ అంకిత్
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివాసం మారిన, ద్వంద్వ నమోదు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు మరో అవకాశం: జిల్లా కలెక్టర్ అంకిత్.
Kothagudem: ఓటర్ల జాబితా సవరణ అర్హులకు మరో అవకాశం - కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి అందని గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, ద్వంద్వ నమోదుల కేటగిరీకి చెందిన ఓటర్లకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో ఈ కేటగిరీ కింద మొత్తం 1,32,785 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు. వీరిలో మరణించిన వారు 31,187 మంది, నివాసం మారిన వారు 78,253 మంది, ద్వంద్వ నమోదులు కలిగిన వారు 14,305 మంది, అందుబాటులో లేని వారు 8,733 మంది, ఇతర కేటగిరీకి చెందిన వారు 307 మంది ఉన్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో సంబంధిత బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్లను సంప్రదించి, వారికి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని తెలిపారు. ఫారాలను పూర్తి చేసి సమర్పించేందుకు అవసరమైన సహకారం అందిస్తారని, ఫారాలను నేరుగా లేదా ఎన్నికల సంఘం ప్రత్యేక ఆన్‌లైన్ వేదిక ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు.
ఇప్పటికీ అదే నివాసంలో కొనసాగుతున్న ఓటర్లు అవసరమైన అనుబంధ పత్రం-బి జతచేసి, నివాసం మారిన ఓటర్లు తమ కొత్త చిరునామా వివరాలతో అనుబంధ పత్రం-సి జతచేసి ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించవచ్చని వివరించారు. ఇప్పటికే ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు తిరిగి ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో ద్వంద్వ నమోదులు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపడుతోందని, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటరు జాబితాలో చోటు కోల్పోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ప్రతినిధులు కూడా ఎన్నికల సిబ్బందికి సహకరించాలని కోరారు.
కావున, సంబంధిత ఓటర్లు తమ ప్రాంత బూత్ స్థాయి అధికారులను సంప్రదించి, అవసరమైన ఎన్యుమరేషన్ ఫారాలు, పత్రాలను సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అంకిత్ విజ్ఞప్తి చేశారు.




