Bhadrachalam: అఖిల భారత రైతు మహాసభలకు మేము సైతం: విద్యార్థుల కవాతు!

Bhadrachalam: నవంబర్ 15న నల్గొండలో జరిగే అఖిల భారత రైతు మహాసభల బహిరంగ సభకు మద్దతుగా భద్రాచలంలో విద్యార్థులు రెడ్ కవాతుకు సిద్ధమయ్యారని సీపీఎం నేత ఏజే రమేష్ పిలుపునిచ్చారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 11 Nov 2026 5:12 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: అఖిల భారత రైతు మహాసభలకు మేము సైతం: విద్యార్థుల కవాతు!

భద్రాచలం నవంబర్ 11: అఖిలభారత రైతు సంఘం జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 15న నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా భద్రాచలం విద్యార్థులు రెడ్ కవాతుకు సిద్ధమవుతున్నారు. రైతాంగ పోరాటాలకు సంఘీభావంగా “మేము సైతం” అంటూ విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

ఎస్ఎఫ్ఐ భద్రాచలం టౌన్ కార్యదర్శి కొప్పుల రవీంద్ర అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ భద్రాచలం ఎస్ఎఫ్ఐ ఇంచార్జ్ 4వ వార్డు మెంబర్ బండారు శరత్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు దేశానికి వెన్నెముక అని, రైతు కష్టంతోనే దేశ ప్రజల ఆకలి తీరుతుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం పునాది అయినప్పటికీ, నేటి కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి ఖర్చులు పెరగడం, గిట్టుబాటు ధరలు లభించకపోవడం, అప్పుల భారం వంటి సమస్యలు రైతుల జీవితాలను సంక్షోభంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాలు రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని, వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం చారిత్రాత్మక పోరాటం నిర్వహించిందని గుర్తుచేశారు. ఆ విధానాల ప్రభావం రైతులకే కాకుండా వారి కుటుంబాల జీవన పరిస్థితులు, పిల్లల విద్య, భవిష్యత్తుపై కూడా పడుతుందని వివరించారు.

నేటి బాలలే రేపటి పౌరులు అని పేర్కొంటూ, దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి విద్యార్థులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలపై అవగాహన పెంచుకోవడంతో పాటు వారి హక్కుల పరిరక్షణ కోసం జరిగే పోరాటాల్లో భాగస్వాములు కావాలని అన్నారు.

అఖిలభారత రైతు సంఘం జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 15న నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో భాగంగా జరిగే రెడ్ కవాతును విజయవంతం చేయాలని, భద్రాచలం విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని రైతాంగ ఐక్యతను చాటాలని కోరారు. రైతు, కార్మిక, విద్యార్థి ఐక్యతతో ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సత్య ఎస్.కె ఆస్మా మన్విత ప్రసన్న వర్షిత తరుణ్ మనోజ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem