Bhadrachalam: భద్రాచలంలో ఇసుకాసురుల బరితెగింపు.. రెండు ట్రాక్టర్లు సీజ్
Bhadrachalam: భద్రాచలం కొల్లుగూడెం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మాఫియాపై కఠిన చర్యలు ఉంటాయని తహసీల్దార్ హెచ్చరించారు.
Bhadrachalam: భద్రాచలంలో ఇసుకాసురుల బరితెగింపు.. రెండు ట్రాక్టర్లు సీజ్
భద్రాచలం: భద్రాచలం కూనవరం ప్రధాన రహదారి పరిధిలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు కేంద్రంగా జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి పట్టుకున్నారు.
పట్టుబడిన వాహనాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం తాసిల్దార్ ఆఫీస్ కి తరలించారు కొల్లుగూడెం ఇసుక ర్యాంపు నుంచి నిత్యం పెద్దఎత్తున అక్రమంగా ఇసుక తరలిపోతోందన్న విశ్వసనీయ సమాచారంతో రెవెన్యూ బృందం రంగంలోకి దిగింది. ఎవరూ లేని సమయం చూసి, అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్ చేసి తరలిస్తుండగా రెవెన్యూ అధికారులను.
గమనించిన కొందరు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ట్రెంచ్‌లు కొట్టినా పూడ్చేస్తున్నారు: తహసీల్దార్ రవికుమార్.ఈ అక్రమ రవాణా ఉదంతంపై మీడియా ప్రతినిధులు స్థానిక తహసీల్దార్ రవికుమార్ గారిని వివరణ కోరగా, ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వివరాలు వెల్లడించారు.
తాను బాధ్యతలు స్వీకరించిన ఈ రెండు నెలల కాలంలోనే అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మూడుసార్లు ర్యాంపు దారుల్లో జేసీబీలతో లోతైన (ట్రెంచ్‌లు/గాడీలు) తవ్వించామని తెలిపారు. అయినప్పటికీ ఇసుక మాఫియా ఏమాత్రం లెక్కచేయకుండా, తవ్విన కందకాలను వెంటనే మట్టితో పూడ్చేసి యథేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత మూడు రోజుల క్రితం కూడా స్వయంగా జేసీబీ యంత్రాలతో ర్యాంపు మార్గాలను మూసి వేయించినప్పటికీ, అక్రమార్కుల తీరులో ఎలాంటి మార్పు రాలేదని తహసీల్దార్ పేర్కొన్నారు. అధికారులు, ప్రజలు సంచరించని అర్ధరాత్రి వేళలను ఆసరాగా చేసుకుని ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు .ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా, కందకాలు తవ్వించి దారులు మూసివేసినా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని తహసీల్దార్ స్పష్టం చేశారు.
గత రాత్రి పట్టుబడిన ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని వెల్లడించారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే స్థానికులు వెంటనే రెవెన్యూ లేదా పోలీస్ యంత్రాంగానికి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన కోరారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ సంపదను కొల్లగొడితే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.




