Bhadrachalam: రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ కింద రూ.1.5 లక్షల ఉచిత వైద్యం!

Bhadrachalam: రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో తొలి బాధితురాలికి రూ.22 వేల చికిత్స అందించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 25 Nov 2026 7:32 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ కింద రూ.1.5 లక్షల ఉచిత వైద్యం!

భద్రాచలం నవంబర్ 25: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించి, ప్రాణాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ (PM RAHAT) పథకం ద్వారా ఒక్కో బాధితుడికి రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పథకం అమలులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి కేసు విజయవంతంగా నమోదైంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్వరాజ్యం అనే బాధితురాలికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పీఎం రాహత్ పథకం కింద సుమారు రూ.22 వేల విలువైన వైద్య సేవలను నగదు రహితంగా అందించారు.

పథకం కింద అందించే వైద్య చికిత్సకు సంబంధించిన ఖర్చులను TMS 2.0 పోర్టల్ ద్వారా జిల్లా కలెక్టర్ లాగిన్ నుంచి ఆసుపత్రికి చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా సకాలంలో అవసరమైన వైద్య చికిత్స పొందేందుకు అవకాశం కలుగుతుంది.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు స్వరాజ్యాన్ని భద్రాచలం సీఐ రాజు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఆర్ఎం బాలాజీ, ఆరోగ్యశ్రీ మిత్ర సుధాకర్, ఆసుపత్రి సిబ్బంది పరామర్శించారు.

ఈ సందర్భంగా డీఆర్ఎం బాలాజీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా అందించే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, తక్షణ వైద్య చికిత్స అందేలా చూడాలని కోరారు. పథకం ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో జిల్లాలో పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, సంబంధిత విభాగాల సమన్వయంతో పీఎం రాహత్ పథకం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem